మనదేశంలోనే తమిళనాడు రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది. దేశమంతా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన రోజుల్లో కూడా తంబీలు ప్రాంతీయ పార్టీలకు పెద్ద పీట వేశారు. అలనాటి కాంగ్రెస్ ను ఇప్పటి బీజేపీని రాష్ట్ర పొలిమేరలకు అవతలే ఆపేశారు. తమిళనాట ఇప్పటికీ ద్రవిడ పార్టీలదే పైచేయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు తమిళనాడులో ప్రత్యేక గుర్తింపు అంటూ లేదు.
మనదేశంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు నేషనల్ పాలిటిక్స్‌లో సందడి చేస్తుంటాయి. జాతీయ పార్టీలకు దేశవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఉంటారు. అయితే జాతీయ పార్టీలు ఎంత పవర్‌ఫుల్ గా ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. దీనికి పునాది వేసింది తమిళనాడు రాష్ట్రం. భారతదేశ రాజకీయ చరిత్రలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలది ఓ భిన్నమైన చరిత్ర. భాషాభిమానం కోసం ప్రాణాలను అర్పించే అరుదైన ప్రాంతం ఇది. ఇక్కడ వ్యవస్థల కంటే వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తమిళనాడు రాజకీయాలలో ఎంజీ ఆర్, కరుణానిధి ప్రధాన పాత్ర పోషించారు. కరుణానిధి, ఎమ్జీఆర్ ఇద్దరూ అనేక సంవత్సరాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించారని చెప్పవచ్చు.
తమిళనాడు అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది ద్రవిడ ఉద్యమం. బ్రాహ్మణ ఆధిపత్యానికి , ఉత్తరాది అధిపత్యా నికి వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఉద్యమాలు నడిచాయి. ఈ ఉద్యమాల్లో నుంచి పుట్టిందే ద్రవిడ కళగం. ద్రవిడుల హక్కుల కోసం ద్రవిడ కళగం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. ఈ పోరాటాల్లో భాగం గానే ద్రవిడ మున్నేట్ర కళగం ..డీఎంకే పేరుతో … 1949లో ఓ ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది. అనేక సంవత్సరాల పోరాటాల నేపథ్యంలో 1967లో తమిళనాట డీఎంకే తొలిసారి అధికారంలోకి వచ్చింది. దేశమంతా కాంగ్రెస్ హవా కొనసాగుతున్న రోజుల్లోనే …ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ తో డీఎంకే నువ్వా నేనా అన్నట్లు సైద్ధాంతిక పోరాటాలు చేసింది. కాంగ్రెస్ విధానాలను దుయ్యబట్టింది. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిం చింది.
కాగా 1970ల్లో ద్రవిడ మున్నేట్ర కళగంలో చీలిక వచ్చింది, వెండితెర వేలుపు ఎమ్ జీ రామచంద్రన్ నాయకత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. అదే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం. 1972లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చంది. ఎమ్జీఆర్ చనిపోయేంతవరకు తమిళనాట అన్నాడీ ఎంకేనే అధికారంలో ఉంది. తమిళనాడు రాజకీయాలలో ఎమ్జీఆర్ ది చెరగని ముద్ర. బాల్యంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ ఒక పిల్లాడు ఆ తరువాత సినీ, రాజకీయ రంగాల ను శాసించారు. కొంతకాలం డీఎంకే లో కోశాధికారిగా పనిచేశారు. ఈ సమయంలోనే అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి కరుణానిధితో విభేదాలు వచ్చాయి. ఎమ్జీఆర్ ను డీఎంకే నుంచి బహిష్కరించారు కరుణానిధి. ఈ పరిస్థితుల్లో అన్నా డీఎంకే పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు ఎమ్జీఆర్. 1977లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్జీ రామచం ద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. 1987లో అనారోగ్యంతో చనిపోయేంతవరకు ఎమ్జీ రామ చంద్రన్ తమిళనాడు సీఎంగా కొనసాగారు.
తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం ఇద్దరు నాయకులు కరుణానిధి, ఎమ్జీ రామచంద్రన్ శాసించారు. తమిళనాడు రాజకీయాలను రాజకీయ దిగ్గజం కరుణానిధి అయిదు దశాబ్దాల పాటు శాసిం చారు. నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి ఆ తరువాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాతికాలంలో డీఎంకేలో కీలక నాయకుడిగా ఎదిగారు. సుదీర్ఘకాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జాతీయ పార్టీలు విఫలమవడమే ప్రాంతీయ పార్టీల పుట్టుకకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కో ప్రాంతీయ పార్టీ ఆవిర్బావానికి ఒక్కో నేపథ్యం ఉంటుంది. ఇక్కడ భారత్ రాష్ట్ర సమితి గురించి ప్రస్తావించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌తో 2001లో భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో బీఆర్‌ఎస్ దాదాపు పథ్నాలుగేళ్ల పాటు ఉద్యమించింది. ఆ తరువాత 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కాగా తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో 1982లో నందమూరి తారక రామారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. 1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీ రామారావు అనేక సంవత్సరాలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు రావడంతో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఇలా ఆవిర్భవించిందే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. దాదాపు 26 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన మమతా బెనర్జీ 1998లో ఆ పార్టీకి గుడ్‌బై కొట్టారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుతో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో బలీయమైన శక్తిగా అవతరించింది.
కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాల నేపథ్యంలో పుట్టుకొచ్చిన మరో పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణానికి చలించిపోయి గుండె ఆగి కన్నుమూసిన అనేక కుటుంబాలను పరామర్శించడానికి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలెట్టారు. అయితే ఓదార్పు యాత్రకు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభేదించారు. ఈ నేపథ్యంలో 2011లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక బలీయమైన శక్తిగా ఎదిగింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది.


