ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కి, ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసింది.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తెస్తూ ఆంధ్రప్రదేశ్ లో స్టూడియో ల నిర్మాణం, ఫిలిం ఇండస్ట్రీకి సంబందించిన వారికి గృహ నిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలను అందించాం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియచేయుచున్నాము. కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాలలో త్వరితగతిన తగిన చర్యలను తీసుకోవాలని కోరుతున్నాము. తద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలకనుగుణంగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తమ వంతు కృషి చేస్తుందని తెలియచేయుచున్నాము.’’ అంటూ టీఎఫ్‌సీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.