అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంతకల్లులో వివాహిత కృష్ణవేణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 24 గంటలు గడుస్తున్నా పోస్టుమార్టం చేయడంలేదని మృతరాలి కుటుంబం ఆసుపత్రి వద్ద రహదారిపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతురాలి బంధువులకు నచ్చజెప్పి మృతదేహానికి శవపరీక్ష చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు.