హనుమకొండ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వెయ్యి స్తంభాల దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉసిరిచెట్టు వద్ద దీపాలు వెలిగించి మహిళలు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి.. ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు నిర్వహించారు.
కార్తీక మొదటి సోమవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని విజయనగరం జిల్లా వంగర మండలంలో సంగాం గ్రామంలో సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తుల దర్శనార్థం చక్కని ఏర్పాట్లు చేసి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. త్రివేణి సంగమం తీరంలో పోలీసు వారు హెచ్చరికల బోర్డులు పెట్టి ప్రజలకు అప్రమత్తం చేశారు.