ఎన్నికలు వస్తే ఎక్కడైనా ప్రజా సమస్యలను ప్రచార అస్త్రాలు చేసుకుంటాయి ప్రతిపక్షాలు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తాయి. ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యల పరిష్కారంలో సర్కార్ చేతగానితనాన్ని వివరిస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అసలు సమస్యలను గాలికొదిలేసింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్‌సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశానికి మద్దతు ఇచ్చింది. విభజన జరిగి దాదాపు పదేళ్లు గడుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం చాలా సార్లు తేల్చి చెప్పింది. ఇక విభజన చట్టంలేని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్నీ ఇస్తాం కానీ, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఇప్పటివరకు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కావాలంటే ఏమైనా ఇస్తాం కానీ, స్పెషల్ స్టేటస్ అనే ముచ్చటే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి బోలెడన్ని లాభాలుంటాయి. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలకు ఇస్తున్న ఫండ్స్ లో ముప్ఫయి శాతం నిధులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందచేస్తారు. మిగిలిన డెబ్భయి శాతం నిధులను ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. అంతేకాదు. గ్రాంట్ల రూపంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. అలాగే పన్నుల్లో మినహాయింపు కూడా ఇస్తారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అన్ని విధాలా రాయితీలు కల్పిస్తారు. అలాగే ప్రోత్సాహకాలు అందిస్తారు.
రుణాల చెల్లింపు సమయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుంది. రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. ఇంతటి కీలకమైన ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం పార్టీ దాదాపుగా విస్మరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఎన్నికల పొత్తు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా అంశానికి అనుకూలంగా బీజేపీ అగ్రనాయకులు ఎవరితోనూ ఒక ప్రకటన కూడా ఇప్పించలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికలు తరుముకువ స్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసిన అంశాల్లో ప్రధానమైనది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. వాస్తవానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలకు దయతలచి అప్పటి కేంద్రం ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సర్కార్ మెడలు వంచి సాధించుకున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు, పౌరుషానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం. తమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువు కున్న యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు. భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు.
అనేక పోరాటాల, త్యాగాల చరిత్ర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నడి బజారులో అమ్మకానికి పెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చెప్పుకోదగ్గ ఆందోళనలు చేయలేకపోయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఆందోళనలు, నిరసన కార్యక్ర మాలు చేపడితే, ఎక్కడ నరేంద్ర మోడీ – అమిత్ షా ద్వయానికి ఆగ్రహం వస్తుందోనన్న భయంతో దాదాపు గా సైలెంట్ అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేయాల్సిదంతా చేసింది. అంతకుమించి బీజేపీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేకపోయింది తెలుగుదేశం పార్టీ. అమరావతి ఉద్యమంలో ప్రదర్శించిన దూకుడును, ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబును చూపించలేదన్న విమర్శలు వచ్చాయి. అసలు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చాంపియన్ గా నిలవడానికి బంగారంలా వచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించు కోలేదన్న విమర్శ అన్ని వర్గాల్లో వినిపించింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సామూహికంగా పదవులకు రాజీనామాలు చేసి వీథుల్లోకి వస్తే ఉద్యమం మరింత ఉథృతంగా ఉండేదన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. అదే జరిగితే జనం దృష్టిలో చంద్రబాబు నాయుడు ఓ హీరో అయిపోయేవారు. అయితే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో సంబంధాలు చెడగొట్టుకోవాలని చంద్రబాబు నాయుడు భావించడం లేదు. మొత్తానికి అసలు అంశాలను గాలికొదిలేసి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణతోనే కాలం వెళ్లదీ స్తుంది తెలుగుదేశం పార్టీ. ఏమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనముందు బచ్చా అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలు, ఎద్దేవాలు ఆయన స్థాయికి తగినట్లు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు.