32.5 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ మోదీపై ఒత్తిడి

  ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో పదహారు మంది లోక్‌సభ సభ్యులున్న తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి ఇదే సరైన తరుణమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మెడపై కత్తి పెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని చంద్రబాబు నాయుడును ప్రజలు కోరుతున్నారు.

 జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఎటువంటి పురోగతి సాధించలేదని సాక్షాత్తూ నిపుణులే అంటున్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందన్న వాదనను 2014 ఏప్రిల్ ఎనిమిదో తేదీన తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ అంగీకరించిన విషయాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని తాము సరిచే స్తామని ఆనాడు తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ హామీ కూడా ఇచ్చారు. పదేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతోంది. అంతేకాదు మరో ఐదేళ్ల పాటు నరేంద్ర మోడీ సర్కారే కొనసాగడానికి ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. గత రెండు దఫాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నం దువల్ల, ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రజలు ఎంతగా మొత్తుకున్నా కేంద్రం పట్టించుకోలేదన్న విమర్శలు న్నాయి. అయితే ప్రస్తుతం ఏర్పడబోయే మూడవ టర్మ్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మెజారిటీ రాలేదు. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థి తులు నెలకొన్నాయి. ఈసారి ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ఎంపీల మద్దతు చాలా అవసరం. దీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  ప్రత్యేక హోదా విషయంలో గతంలో పరిస్థితి వేరేగా ఉండేది. 2014 నుంచి వరుసగా రెండు టర్మ్‌లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం మోడీ సర్కార్‌కు ఉండేది కాదు. ఈ నేపథ్యంలో తాము ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, స్వయంగా ప్రధానిని కలిసి విన్నవించినా, తమ మాట వినిపించు కోలేదని జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. దీంతో ఇది వాస్తవమే కదా. అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో సీన్ మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని తీరాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పదేళ్ల కిందట యూపీఏ ప్రభుత్వమే పార్లమెంటు లో హామీ ఇచ్చింది. అయితే 2014 తరువాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. తిరుగులేని మెజారిటీ కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి.

  ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ సాధించుకోవాల్సిన డిమాండ్లు మరికొన్ని ఉన్నాయి. ఇందులో మొదటిది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. ఉక్కు ఫ్యాక్ట‌రీని తెలుగు ప్ర‌జ‌ల‌పై ద‌య‌త‌ల‌చి అప్ప‌టి ఇందిరా గాంధీ నాయకత్వం లోని కేంద్రం ఇవ్వ‌లేదు. విశాఖ ఉక్కు  ఆంధ్రుల హ‌క్కు అంటూ తెలుగు ప్ర‌జ‌లు ఉద్య‌మించారు. అప్ప‌టి ఇందిరా గాంధీ స‌ర్కార్ మెడ‌లు వంచి సాధించుకున్నారు. తెలుగు ప్ర‌జ‌ల ఐక్యతకు,పౌరుషానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ. త‌మ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వ‌స్తే చ‌దువు కున్న కుర్రకారుకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్త‌రాంధ్ర కు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు. భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఉక్కు ఫ్యాక్ట‌రీని కేంద్ర ప్రభుత్వం నడిబజారులో అమ్మకానికి పెట్టింది గతంలోని నరేంద్ర మోడీ సర్కార్. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేసింది. అయితే ప్రస్తుతం కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు అవసరం ఉంది కాబట్టి, ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

  విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్. ఈ ఏర్పాట్లకు సంబంధించిన 2019 సెప్టెంబరులో రైల్వే బోర్డుకు డీపీఆర్‌ అందచేశారు. ఈ డీపీఆర్ ఆమోదం కూడా పొందింది. అయితే ఇప్పటివరకు రైల్వే జోన్ ఏర్పాటు పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఓసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, 2019 ఫిబ్రవరి 27న విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత 2019 మార్చి ఎనిమిదిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఓఎస్డీ నియామకం కూడా జరిగింది. విశాఖలో రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని అప్పటి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2024 ఫిబ్రవరి రెండో తేదీన ఢిల్లీలో వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాలంటే భూమి అవసరమని, దాని కోసం ఏపీ ప్రభుత్వం 52 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, దానిని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

సాధారణంగా డీపీఆర్ సమర్పించిన ఆరు నెలల్లోనే పనులు ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ దక్షిణ కోస్తా రైల్వే డీపీఆర్ సమర్పించి ఐదేళ్లు దాటిపోయినా కనీసం జోన్ విషయంలో ఒక్క ఇటుక కూడా పడ లేదు. అంతేకాదు రైల్వే జోన్ పనుల ప్రారంభానికి కేటాయించిన భూమి విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టుకుంటూ కాలం గడిపేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చొరవ చూపాలని రాష్ట్ర ప్రజలు కోరుతు న్నారు. 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్