స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం బండి మాట్లాడుతూ.. బీజేపీ మద్దతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. 1400 మంది బలదానాలతో రాష్ట్రం ఏర్పడిందని.. అనేక రంగాల్లో రాష్ట్ర అబివృద్దికి మోడీ ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటులో బీజేపి ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. 9 ఏళ్ల కాలంలో కేంద్రం.. రాష్ట్రానికి 4 లక్షల కోట్ల నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందని.. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడింది అనే సంతోషం తప్పా.. రాష్ట్ర సాధన ఆకాంక్షలు ఇప్పటికి నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజ్ రీయింబర్స్మెంట్ ముందుగానే చెల్లిస్తామన్న బండి సంజయ్.. ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. నిలువ నీడ లేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. పంట నష్టపరిహారం 10 వేల ఇస్తానని ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. మేము అధికారంలోకి రాగానే పసల్ భీమాను రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని.. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకోవడం కంటే దుర్మార్గం ఇంకొక్కటి ఉందా? అని ప్రశ్నించారు.
హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తే… కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఅర్ఎస్, కాంగ్రెస్ కు అభ్యర్థులు గల్లంతు అయ్యారని అన్నారు. అనేక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పత్త లేని పార్టీ కాంగ్రెస్అని మండిపడ్డారు. బీజేపి అడ్డుకుంటే ఆగే పార్టీ కాదని.. రాష్ట్ర అభివృద్ధికి మోడీ సహకరించినా కేసిఆర్ దానికి సిద్దంగా లేరని అన్నారు. బీజేపీని తట్టుకోలేక కేసిఆర్.. టీఆర్ఎస్ ను బీఅర్ఎస్ గా మార్చి రాష్ట్రం దాటారని వ్యాఖ్యానించారు. గడిల పాలనను అంతమొందించడానికి బీజేపి ముందడుగు వేస్తోందన్న బండి.. ఒక కుటుంబం చేతిలో బంది అయిన తెలంగాణ తల్లిని విడిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు.