రెవెన్యూ రాబడులపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బడ్జెట్‌కు తగ్గట్టుగా రాబడులు రాకపోవడంతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈక్రమంలోనే వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా వంటి అన్ని శాఖల నుండి లక్ష్యానికి తగ్గుట్టుగా ఆదాయం సమకూరాలన్న లక్ష్యంతో నేటి నుంచి సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు రేవంత్. ప్రతి రోజూ ఒక్కో శాఖను సమీక్షించనున్నారు. సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం మేరకు అధికారులకు రాబడులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
గత వారం, ఆదాయం బడ్జెట్‌కి తగ్గట్లుగా రాకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గడం వంటి సమస్యలను పరిగణనలోకి తీసుకున్న సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే,..ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు లక్ష్యాల కంటే 20% తగ్గాయని తేలింది. దీంతో రాబోయే ఆరు నెలల్లో లక్ష్యాలను చేరుకోవడానికి, మొదటి ఆరు నెలల్లో వచ్చిన తగ్గుదలని భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే,.. ఇతర రాష్ట్రాలలో రెవెన్యూ వసూళ్లు ఎలా పెరిగాయి? అందుకు కారణాలేమిటి? అక్కడ అమలు చేసిన సంస్కరణలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూళ్లను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంది? వంటి విషయాలను సమగ్రమైన అధ్యయనం చేయాలని, అవసరమైతే కొంతమంది అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించాలని సీఎం సూచించారు. దీంతో ప్రస్తుతం సంబంధిత శాఖలు కార్యాచరణలో నిమగ్నమయ్యాయి. నేటి నుంచి జరిగే సీఎం సమీక్షల అనంతరం కొన్ని సంస్కరణలు తీసుకువచ్చే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.