Bhadradri |భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. నిన్న శ్రీరామ పట్టాభిషేకాన్ని ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించగా.. ఈరోజు ఉదయం లక్ష్మణ సమేత సీతారామ చంద్ర స్వామి వారికి రథోత్సవం నిర్వహించారు. ఈ వేడుకను చూడడానికి అశేష భక్తజనం వచ్చారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం, సామ్రాజ్య పట్టాభిషేకం తర్వాత రథోత్సవ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తొలుత లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలతో రథం వద్దకు తీసుకొచ్చి రథంలో వేయింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నుంచి తాత గుడి సెంటర్ వరకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రథంలో కొలువైన భద్రాద్రి(Bhadradri) రామయ్యను చూడడానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. చిన్నపాటి వర్షం పడటంతో స్వామి వారి సేవకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రామయ్యకు వేదపండితులు మహదాశీర్వచనం వేడుక నిర్వహించనున్నారు.
Read Also: శాశ్వతంగా దూరం కానున్న మధ్యతరగతి కారు
Follow us on: Youtube, Instagram, Google News