Telangana Secretariat | తెలంగాణ నూతన సచివాలయ మహాద్వారం.. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహాద్వారాన్ని ఆదిలాబాదు అడవుల్లోని టేకు కలపతో నాగపూర్ లో తయారుచేశారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. చివాలయ భవనంపైన నాలుగు రకాలైన 34 డోమ్స్‌ను ఏర్పాటు చేశారు.తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్ వంటి కట్టడాల్లో భారీ డోమ్స్ (గుమ్మటాలు) నిర్మించినట్టుగా రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ డోమ్స్ నిర్మించారు. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు. ఇలా సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గుమ్మటాలను నిర్మించారు. ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్స్ రూపొందించడం ఇదే తొలిసారి. ఒక్కో డోమ్ 82 అడుగులు ఎత్తు (దాదాపు 8 అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంది.
తెలంగాణ నూతన సచివాలయం మొత్తం భూ విస్తీర్ణం 28 ఎకరాలు ఉంటుంది. భవనం నిర్మించిన ఏరియా 2.45 ఎకరాలు ఉంటుంది. ల్యాండ్ స్కేపింగ్ : 7.72 ఎకరాలు, సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు, పార్కింగ్ : 560 కార్లు, 700 ల బైక్ లు, యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ, ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ, లోయర్ గ్రౌండ్ + గ్రౌండ్ + ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు : 14 అడుగులు, అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు, భవనం పొడవు, వెడల్పు : 600 X 300, ప్రధాన గుమ్మటాలు (స్కైలాంజ్) : 11వ అంతస్థు వరకు ఉంటుంది.
ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే జాతీయ చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించి తీసుకువచ్చి అమర్చారు. నీటిని పొదుపు చేసే ఉద్దేశంతో సచివాలయ భవనం భూగర్భంలో రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించబడింది. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్ లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్టమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు.
సచివాలయ నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి… ఉక్కు: 8,000 మెట్రిక్ టన్నులు, సిమెంటు: 40,,000 మెట్రిక్ టన్నులు, ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు), కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు, ఇటుకలు: 11 లక్షలు, ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు, గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు, మార్బుల్: లక్ష చదరపు అడుగులు, ధోల్ పూర్ రెడ్ స్టోన్: 3,500 ఘనపు మీటర్లు, కలప: 7,500 ఘనపుటడుగులు, పనిచేసిన కార్మికులు: మూడు షిప్టుల్లో 12,000 మంది.
నూతన సచివాలయ అంతస్తుల్లో పలు శాఖల మంత్రులకు, అధికారులకు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు. 1వ అంతస్తు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖ, 2వ అంతస్తు: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ, 3వ అంతస్తు: ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్, 4వ అంతస్తు : ఫారెస్ట్, కల్చరల్ డిపార్ట్ మెంట్, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్ మెంట్, 5వ అంతస్తు: ఆర్ అండ్ బి, సాధారణ పరిపాలన శాఖలు, 6వ అంతస్తు: సీఎం, సీఎస్, సిఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.