లీకువీరులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్మొన్న శ్వేతపత్రం నిన్న సన్న వడ్లకు బోనస్ అంశం.. ఇలా కొన్ని ముఖ్యమైన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నా ముందుగానే ప్రతిపక్షాలకు తెలిసిపోతున్నాయన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో లీకు వీరులెవరు అన్నదానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇప్పటికే దృష్టి పెట్టిన రేవంత్ సర్కారు. ఎన్నికల ఫలితాల తర్వాత వారి భరతం పట్టాలని భావిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విపక్షాలకు ముందే తెలిసిపోతున్నాయా ? స్వయంగా సీఎంవో నుంచే సమాచారం బయటకు వస్తోందా ? అలాగైతే ఆ లీకు వీరులెవరు ? ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు ఇదే అంశంపై దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల అనంతరం తెలంగాణలో గతేడాది కొత్తగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై, చేసిన ఖర్చులపై శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఇందులో భాగంగానే నీటి పారుదల అంశంపై వైట్ పేపర్ విడుదల చేసింది రేవంత్ ప్రభుత్వం. ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలు సహా పలు అంశాలను పొందుపరుస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది తెలంగాణ సర్కారు.
ఇంతవరకు బాగానే ఉన్నా, ఇక్కడే ఒక కీలక అంశం దాగుంది. వైట్ పేపర్ విడుదల చేసిన సందర్భంలో అసెంబ్లీల తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎంతోపాటు సంబంధిత శాఖ మంత్రి పలు కీలకమైన అంశాలను, ప్రశ్నలను లేవనెత్తారు. ప్రతిపక్షాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రభుత్వం సంధించిన అన్ని ప్రశ్నలకు సమర్థంగా సమాధానం చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతేకాదు సర్కారు లేవనెత్తని అంశాలను సైతం ప్రస్తావించారు. ఇంకా చెప్పాలంటే ఈ చర్చ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షం పైచేయి సాధించిందన్న అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో సైతం కలిగిందని అనడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి. ఇక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మరో కీలక అంశం సన్నవడ్లకు బోనస్. వాస్తవానికి ఈ అంశాన్నికేబినెట్ అజెండాలో పెట్టి నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇదే అంశాన్ని సీఎం, ఇతర ముఖ్యనేతలు చర్చించినట్లు సమాచారం. అయితే, ఇదంతా జరగకముందే సన్నవడ్లకే కాదు.. అన్ని రకాల వడ్లకు సైతం బోనస్ ఇవ్వాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇది కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఇలాంటి అంశాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే, ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన నిర్ణయాలు బయటకు రాకముందే లీకవుతున్నాయన్న సందేహాలు ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వారిలో కలుగుతున్నాయి. అది నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం కావచ్చు. సన్న వడ్లకు బోనస్ అంశమూ కావచ్చు..ఇలా ఏది తీసుకున్నా, విపక్షం సమర్థంగా, ముందుగా తమ వాణి విన్పించడాన్ని లోతుగా విశ్లేషిస్తే సమాచారం ముందే బయటకు వస్తోందన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందన్న అభిప్రాయమూ మరికొందరిలో వ్యక్తమవుతోంది. ఇలా జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనించి ప్రభుత్వ పెద్దలు అలర్టయినట్లు తెలుస్తోంది. సీఎంవోతోపాటు ఇతర డిపార్ట్ మెంట్లలో ఉన్న కీలక అధికారులు కొందరు సమాచారాన్ని ప్రతి పక్షానికి అందిస్తున్నారన్న అనుమానాలు ఈ సందర్భంగా బలపడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్య శాఖలు నిర్వహించిన మంత్రుల వద్ద పనిచేసిన కొందరు అధికారులే ఈ వ్యవహారానికి పాల్పడుతున్నట్లుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారు లు ముఖ్యమంత్రికి ఈ మేరకు ఓ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు ఏ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయినా సర్వసాధారణంగానే జరుగుతుంటాయన్న వాదన మరికొందరు విన్పిస్తున్నారు. అందుకే ఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనా, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా మొదట చేసే పని అధికారుల బదిలీలే. ఆ దిశగా ఇప్పటికే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొందర్ని బదిలీ చేశారు. మరికొందర్ని ట్రాన్స్ ఫర్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ లోగా ఎన్నికలు రావడంతో ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారాయన. అయితే ఇప్పటికే అలాంటి వారిపై ప్రభుత్వం నిఘా పెట్టిందని.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వారి భరతం పట్టడం ఖాయమన్న వాదన విన్పిస్తోంది.