హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి హరీశ్ రవు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో లక్షా30వేల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే తొలి విడత అమలు చేశామని, త్వరలోనే రెండు విడత చేపడతామని అన్నారు. ఇక గృహలక్ష్మి పథకం ద్వారా 4లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. లబ్దిదారుడికి రూ.3లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం చేయనున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఏప్రిల్ నెలలో ప్రారంభించి.. ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.