మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఉన్నపళంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్‌లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు ఆ సర్వీసు అప్‌డేటే కారణమని క్రౌడ్ స్ట్రయిక్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజినీర్లు పనిచేస్తున్నారని చెప్పింది.
బ్లూ స్క్రీన్‌లో కనిపిస్తున్న ఈ ఎర్రర్స్‌ను బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేదా స్టాప్ కోడ్ ఎర్రర్స్‌గా పిలుస్తారు. దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్‌డౌన్, లేదా రీస్టార్ట్ అవుతుంది. సాధారణంగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్ తలెత్తుతుంటాయి. ఒకవేళ ఇటీవల ఏదైనా హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల బ్లూ స్క్రీన్ ఎర్రర్ తలెత్తి ఉంటే.. సిస్టమ్‌ను షట్‌డౌన్ చేసి, హార్డ్‌వేర్‌ను తొలగించి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తాజా బ్లూస్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సూచించింది.


