స్వతంత్ర, కృష్ణా జిల్లా : టీడీపీ సీనియర్ నేత, గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు(Bachula Arjunudu) కన్నుమూశారు. కొన్నిరోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆయన.. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. అర్జునుడు మరణంతో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సీనియర్ నేతలు తీవ్ర సంతాపం తెలియజేశారు.
టీడీపీ(TDP) స్థాపించిన దగ్గరి నుంచి ఆయన పార్టీలో సేవలందిస్తున్నారు. బీసీ అయిన బచ్చుల అర్జునుడు పార్టీలో అనేక పదవులు చేపట్టారు. గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మచిలీపట్నంకు చెందిన అర్జునుడు మూడు సంవత్సరాల నుంచి గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
బచ్చుల అర్జునుడు 1954 జులై 4న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005 వరకు బందరు మున్సిపల్ చైర్మన్ గా కొనసాగారు. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా కూడా అర్జునుడు పనిచేశారు. 2017లో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Read Also: ఈసారి జనసేన ఆవిర్భావ సభ అక్కడే.. వారాహితో ఎంట్రీ ఇవ్వనున్న పవర్‌స్టార్
Follow us on: Youtube