స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో యుగపురుషుడు ఎన్టీఆర్ సత్తా జయంతి వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్. సమాధి వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు తారక్. జూనియర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. ఘాట్ వద్దకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. అంతకు ముందు నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు. తెలుగువారికి ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం అని చెప్పారు బాలకృష్ణ. ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్ నాంది పలికారని బాలకృష్ణ తెలిపారు. ‘ఎన్టీఆర్ యుగపురుషుడు. ఆయన నెలకొల్పిన తెలుగు దేశంపార్టీ ఓ ప్రభంజనం. ప్రజాసంక్షేమాన్ని ప్రవేశపెట్టిన మొదటి సీఎం ఎన్టీఆర్. నటనలో తొలి పది స్థానాలు ఆయనవే’ అని బాలకృష్ణ తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారింది. మహిళలకు ఆస్తి హక్కు తదితర చరిత్రాత్మక నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని బాలకృష్ణ అన్నారు. వీరితో పాటు నందమూరి రామకృష్ణ ఇతర నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు అన్న తారక రామారావుకి ఘన నివాళులు అర్పిస్తున్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజమాబాద్ జిల్లా వర్నిలో ఎన్టీఆర్ క్యాంస విగ్రహాన్ని స్పీకర్ పోచారం ఆవిష్కరించారు.
ఇక మరోవైపు రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో.. నేడు టీడీపీ మేనిఫెస్టో మొదటి ప్రణాళిక విడుదల చేయనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్నికలే లక్ష్యంగా మహానాడులో పొత్తులు, మేనిఫెస్టో, తదితర విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో మహానాడు ప్రాంగణమంతా కళకళలాడుతోంది. ఇది ఎన్నికల మహానాడు కావడంతో టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇక ఈ రోజు మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఇష్టమైన వంటలను వడ్డించనున్నారు.