స్వతంత్ర వెబ్ డెస్క్: చెరుకుపల్లి మండలం ఉప్పాల వారి పాలెం గ్రామంలో మృతి చెందిన ఉప్పాల అమర్నాథ్ కు నివాళులర్పించేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు ఉప్పాలవారిపాలెం వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబీకులను పరామర్శిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16న చెరుకుపల్లి మండలం రాజోలు వద్ద పాము వెంకటేశ్వరరెడ్డి, అతని స్నేహితులు ముగ్గురు కలిసి ట్యూషన్‌కు వెళుతున్న అమర్‌నాథ్‌ను కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరగాలని, నేరస్థులకు శిక్ష పడాలని శనివారం రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాస్తారోకో నిర్వహించారు. హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నేరస్థులకు శిక్ష పడే వరకు తాము పోరాడతామని తెలిపారు.