ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా జరిగిన రాళ్ల దాడి ఘటనపై హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు ఫిర్యాదు చేశారు. వీవీఐపీ భద్రత పోలీస్ స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘిస్తున్నారని.. సంఘ విద్రోహ శక్తులతో పోలీసులు కలిసి పనిచేయడంపై విచారణ జరిపించాలని ఫిర్యాదు లేఖలో విజ్ఞప్తి చేశారు.
యర్రగొండపాలెం ఘటనతో పాటు గతంలో చంద్రబాబుపై జరిగిన సంఘటనలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఆందోళనకారులు దాడికి ముందుగానే సిద్ధమైనా చంద్రబాబుకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీనారాయణ కోరారు.
మరోవైపు యర్రగొండపాలెం ఘటనను టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. నేతలతో మాట్లాడిన చంద్రబాబు ఈ ఘటనకు గవర్నర్ కు ఫిర్యాదుచేయాలని సూచించారు. ఇప్పటికే కొన్ని వీడియోలను ఈమెయిల్ ద్వారా రాజ్ భవన్ కు పంపించినట్లు తెలుస్తోంది. అటు రాళ్ల దాడి ఘటనలో NSG కమాండెంట్ కు గాయాలవ్వడంతో NSG హెడ్ క్వార్టర్స్ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్థానిక భద్రతాధికారులను
ఆదేశించింది.