ఏపీలో టీడీపీ హవా దుమ్ములేపుతోంది. చరిత్ర తిరగరాస్తూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే నిమ్మల రామానాయుడు, బాలకృష్ణ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టగా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా ఏడవ సారి విజయం సాధించారు.
టీడీపీకి కంచుకోట అయిన హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ మూడవసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. ప్రతీరౌండ్‌లోనూ ఆధిక్యంలో నిలుస్తూ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆయన నివాసానికి చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ఇక బాలకృష్ణ గత ఎన్నికల ఫలితాలను చూసుకుంటే 2014లో తొలిసారిగా హిందూపురం నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్ధి నవీన్ నిశ్చిల్‌పై 16 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం 2019లో జగన్ ప్రభంజనంలోనూ 17 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో టీడీపీదే హవా. మరో పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టంకట్టిందే లేదు. 1985, 89, 94లలో ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకోగా.. ఆ తర్వాత 96లో నందమూరి హరికృష్ణ, 99లో సీసీ వెంకటరాముడు, 2004లో రంగనాయకులు, 2009లో అబ్థుల్ ఘనీలు హిందూపురంలో టీడీపీ తరపున గెలుపొందారు. ఇప్పుడు వరుసగా విజయాలు సాధించి బాలయ్య అదే సత్తాను చాటుతూ హ్యాట్రిక్ కొట్టారు.


