నారాయణా హృదయాలయాలో చికిత్స 90శాతం మూసుకుపోయిన ఎడమ కవాటం
ఒక బృహత్తరమైన లక్ష్యసాధన కోసం…రాష్ట్రమంతా పాదయాత్ర చేయడం అంటే మాటలు కాదు. అలాగే ఆ పాదయాత్ర నిర్వహణ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకుని, రోడ్డు మ్యాప్ ల దగ్గర నుంచి, ప్రతిరోజూ ఎంతదూరం వెళ్లాలి? ఎక్కడ సభలు పెట్టాలి? ఆ ప్రాంతంలో రాజకీయ నేతలతో చర్చించడం, ఏర్పాట్లు, భోజనాలు, రాత్రి నిద్ర ఇలా ఒకటి కాదు కొన్ని వందల పనులు దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ చూసుకోవాలి.
ఇలా అలుపెరగకుండా పనిచేసిన తారకరత్న అలసిపోయాడని అంటున్నారు. అందుకే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యంపై అశ్రద్ధ చేయడంతో ఒకేసారి అన్నీ మీద పడ్డాయని అంటున్నారు. ఇక పాదయాత్ర అనుమతుల దగ్గర నుంచి ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల వరకు… ఒకటే టెన్షన్లు…
ఈ క్రమంలో సరిగ్గా పాదయాత్ర మొదలైన కొద్ది సేపటికే తారకరత్నకు ఉన్నట్టుండి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో, అభిమానులు హుటాహుటిన కుప్పంలో పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు.
పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికే ఇలా జరగడంతో అభిమానులు అందరిలో ఆందోళన మొదలైంది. బెంగళూరుకు తరలిస్తే మార్గమధ్యలో సెకండ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచించడంతో అక్కడే ఉంచి వైద్యం చేయించాలని నిర్ణయించారు. దాంతో నారాయణ హృదయాలయ వైద్యులు డాక్టర్ ఉదయం నేతృత్వంలో బృందం ఆసుపత్రికి చేరుకుని చికిత్స ప్రారంభించింది.
మరోవైపు ఆర్టిఫిషియల్ హార్ట్ అమరికపై కూడా డాక్టర్ల మధ్య చర్చ జరుగుతోంది. అయితే ఉదయం కంటే తారకరత్న ఆరోగ్యం మెరుగైందని పీఈఎస్ వైద్యులు చెబుతున్నారు. తారకరత్న సతీమణి కుప్పం చేరుకున్నారు. దాంతో కుటుంబ సభ్యుల సలహా మేరకు రాత్రికి రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
తెల్లవారుజామున కావడంతో రోడ్డు ట్రాఫిక్ లేకుండా ఉంటుందని భావించారు. అదే ఉదయం పూట అయితే మళ్లీ గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేయాలని, అవన్నీ అనుమతులతో కూడుకున్నవని భావించి రాత్రి తరలించారు.
తారకరత్న హార్ట్ లో కుడి, ఎడమవైపు 90శాతం బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆల్రడీ ఒక స్టంట్ వేశారు. నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. బాలకృష్ణ రాత్రే బెంగళూరు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా బెంగళూరు వెళ్లనున్నారు.
నందమూరి వారసులందరూ కూడా ఒకొక్కరుగా బెంగళూరు చేరుకుంటున్నారు. తారకరత్నని సినిమా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు జరిగాయి గానీ, ఆయనకి టైం కలిసి రాలేదు. తర్వాత వ్యాపార వ్యవహారాల్లో పడిపోయారు. చాలాకాలం ప్రజలకి కనిపించ లేదు. మళ్లీ రాజకీయాల్లో కాసేపు హడావుడి చేశారు. ఇదిగో మళ్లీ ఇప్పుడే లోకేష్ పాదయాత్రలో ప్రజల ముందుకి వచ్చారు. వచ్చీరాగానే తొలిరోజే ఇలా జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.