ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి కోరారు. గన్‌మెన్‌లను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ పంపారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రత కోసం ప్రభుత్వం పోలీసు రక్షణ అందించాయని స్వామీజీ లేఖలో పేర్కొన్నారు. 2019 నుంచి శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావించటంతో తనకు కల్పించిన ఎక్స్ కేటగిరీ వెనక్కి తీసుకోవాలని స్వరూపానందేంద్రస్వామి కోరారు.
కాగా, శారదా పీఠానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల గట్టి షాక్ ఇచ్చింది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో గత వైసీపీ ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ అక్టోబర్ 24న ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్ రోడ్డులో కొత్తవలస వద్ద సుమారు 225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి కేవలం 15 లక్షలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. పీఠానికి కొండపై కేటాయించిన భూమికి Visakhapatnam Metropolitan Region Development Authority రెండు కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టింది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాకుండా వాణిజ్య కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతించిందని గత ప్రభుత్వంపై విమర్శలున్నాయి. అక్కడ ఎనిమిది అంతస్థులతో బోర్డింగ్ హౌస్ పేరుతో హోటల్ నిర్మాణానికి జీవో ఇచ్చింది గత ప్రభుత్వం. శారదా పీఠం పేరున కాకుండా ఉత్తరాధికారి పేరిట భూమిని బదలాయించిన విషయం వెలుగులోకి రావడంతో… ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల నివేదిక తెప్పించుకుంది. దానిని పరిశీలించిన అనంతరం చివరకు భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ భూ కేటాయింపులను అక్టోబర్ 28న రద్దు చేయగా, 29న తహసీల్దారు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా… ఏపీ మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత సీఎం తన గురువుకు దక్షిణగా 300 కోట్ల విలువైన 15 ఎకరాలను కేవలం 15లక్షలకే ఇచ్చేశారని పేర్కొన్నారు. కలెక్టర్ ఎకరాకు కోటిన్నర చొప్పున వసూలు చేయాలని ప్రతిపాదించినా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. భీమునిపట్నం మండలం కొత్తవలస వద్ద శారదా పీఠానికి భూముల కేటాయింపు అంశంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. మొదట ఓ చోట భూమి కేటాయించి, ఆ తర్వాత విలువైన చోట ఇచ్చారని ఆరోపించారు. వేద పాఠశాలని చెప్పి వాణిజ్య అవసరాలకు అవకాశం కల్పించారని అన్నారు. మఠంలో అధికారంలేని ఉత్తరాధికారి పేరిట ఆదేశాలిచ్చారని… ఇలా అన్ని ఉల్లంఘనలే జరిగాయని మంత్రి అన్నారు.
మొత్తంగా విశాఖ శారదాపీఠం చుట్టూ వివాదం నడుస్తున్న నేపథ్యంలో స్వరూపానందేంద్ర స్వామి భద్రత వద్దనడం చర్చనీయాంశంగా మారింది.