మకర సంక్రాంతి పర్వదినాన, మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు ఆర్తిగా ఎదురు చూసి జ్యోతిని దర్శించుకున్నారు. మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తిపారవశ్యం చెందారు. జ్యోతి దర్శనానికి ముందు ఎక్కడ చూసిన భక్తులే, అంతటా అయ్యప్పదీక్షా స్వాములే.. శబరిమల ఆలయ పరిసరాలు ఇసుక వేస్తే రాలనంతగా భక్తులతో నిండిపోయింది. మకర సంక్రాంతి రోజు సాయంసంధ్యా సమయంలో శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ఈశాన్య దిశలోని పర్వతశ్రేణుల్లో జ్యోతిని దర్శించుకున్నారు. జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు దిక్కులు పిక్కటిల్లేలా.. అయ్యప్పస్వామి శరణుఘోష చేసారు. మకర జ్యోతి దర్శనం చేసుకుంటే మరుజన్మ ఉండదని, దేహం చాలించాక భగవంతుడిలో ఐక్యం అయిపోతామని భక్తులు విశ్వసిస్తారు.
జరా, మరణాలు లేకుండా దైవైక్యం చెందింప చేసే మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు ఎన్ని కష్ట, నష్టాలైన భరించి జ్యోతి దర్శనం చేసుకుంటారు. లక్షలాది మంది భక్తులు, అయ్యప్ప స్వాములు మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. శబరిమల ఎదుట ఉన్న కందమల శిఖరంపైన దర్శనమిచ్చిన జ్యోతి దర్శనం చేసుకున్న భక్తులు, దీక్షలకు ముందు అయ్యప్ప స్వామి చరిత్రను, మహిమలను కధలుగా, పాటలుగా, భజనలుగా ఆలపిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 41 రోజుల పాటు కఠోర దీక్ష పాటించి, పడిపూజలు ఉపవాస దీక్షలు చేశారున. గురుస్వాముల ఆధ్వర్యంలో మండల దీక్షలు, జ్యోతి దర్శన దీక్షలు చేపట్టారు. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తులు భావిస్తారు. అందుకే అధికసంఖ్యలో అయ్యప్పలు దీక్షలు చేపట్టి జ్యోతి దర్శనం చేసుకుంటారు.
దేశంలోని అతి ప్రసిద్ధ, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శబరిమలై పుణ్యక్షేత్రాలనికి ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు వస్తూంటారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు మండల దీక్షలు, మకర జ్యోతి దర్శన దీక్షలు చేపడ్తారు. మకర జ్యోతి దర్శనానికి వచ్చే అయ్యప్పల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మకర జ్యోతి దర్శనం అయ్యాక అయ్యప్ప మాలధారులు దీక్షను విరమిస్తారు. మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనం అంటే జన్మ జన్మల అదృష్టం ఉండాలని భక్తులు చెబుతున్నారు. కఠోర దీక్షలు చేసి, మైళ్ల కొద్దీ దూరాలు ప్రయాణాలు చేసి, గంటల కొద్దీ లైన్లలో నిలబడి ఎన్నో కష్ట, నష్టాలు ఓర్చి స్వాములు ఈ దర్శనం చేసుకుంటారని, అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటేనే ఈ దర్శనభాగ్యం కలుగుతుందని భక్తులు వెల్లడిస్తున్నారు.