చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. నాలుగు రోజుల కిందట అస్వస్థతకు గురైన రజినీకాంత్.. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. చెన్నై అపోలో ఆస్పత్రి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో వైద్యులు ఆయనకు స్టెంట్ అమర్చారు. ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా తలైవాకు స్టెంట్ వేసినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 30న ఛాతిలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన రజినీని కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం, గుండె నుంచి బయటికి వచ్చే రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం స్టెంట్ అమర్చడంతో రెండు రోజుల అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇంటికి పంపారు. తమ అభిమాన నటుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో.. తలైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే వారమే రజినీకాంత్ నటించిన కొత్త చిత్రం వెట్టియాన్ దసరా కానుకగా విడుదల కానుంది.