ఒక మనిషి తన జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచనకు రావడం వెనుక ఎంతటి బాధ, నిరాశ, అర్ధరహిత భావన దాగి ఉంటుందో ఊహించగలమా? ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన వ్యక్తి, రాత్రికి కనిపించకుండా పోవడం… నిన్న మనం చూసిన చిరునవ్వు, ఈరోజు ఒక మౌనంగా మిగిలిపోవడం… ఈ అనుభూతిని ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆత్మహత్య అనేది ఎంతటి బాధతో నిండిన చర్యో తెలుస్తుంది.
ఆత్మహత్య అనేది వ్యక్తి తీవ్ర మనోవేదన, ఒత్తిడి, లేదా నిస్సహాయత భావంతో తీసుకునే తుదినిర్ణయం. ఇది వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యల కారణంగా ఏర్పడే తీవ్రమైన సమస్యగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. ఈ సమస్య పురుషులలో అధికంగా కనిపిస్తుండటం గమనార్హం. సామాజిక అంచనాలు, భావోద్వేగాలను బయట పెట్టలేని పరిస్థితి, ఆర్థిక భారం, ఒంటరితనం వంటి కారణాలు పురుషుల ఆత్మహత్యల సంఖ్యను పెంచుతున్నాయి. బాధను వ్యక్తం చేయలేక, సహాయం కోరలేక, లోపలే కుంగిపోతూ చివరికి ఒక అంధకారపు మార్గాన్ని ఎంచుకోవడం… ఎంత దురదృష్టకరమైన విషయమో కదా.
1990 నుంచి 2021 వరకు భారతదేశంలో ఆత్మహత్యల మరణాల రేటు 30 శాతానికి పైగా తగ్గిందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. 1990లో ఈ రేటు ప్రతి లక్ష మందికి 18.9 ఉండేది. 2019లో ఇది 13.1 కాగా, 2021లో 13కు తగ్గింది. అంటే, మూడు దశాబ్దాల్లో ఈ రేటు 31.5 శాతం తగ్గింది. ఈ కాలంలో పురుషుల కన్నా మహిళల ఆత్మహత్యల రేటు తగ్గింది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 7,40,000 ఆత్మహత్యలు నమోదవుతున్నాయని పరిశోధనలో వెల్లడైంది. అంటే సగటున ప్రతి 43 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఇక పురుషులలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. సమాజంలో పురుషులకు పెట్టబడిన బాధ్యతలు, వారు అనుభవించే ఒత్తిళ్లు, వ్యక్తిగత భావోద్వేగాలను వ్యక్తపరచలేని పరిస్థితి వారిని ఒకరకమైన సమస్యల వలయంలోకి నెట్టేస్తున్నాయి . సాధారణంగా పురుషులు ఎక్కువగా కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. సంపాదన కోసం నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, అది వారి మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పనిలో విఫలం కావడం, ఉద్యోగం పోవడం, వ్యాపార నష్టాలు, అప్పులు ఇలాంటి పరిస్థితుల్లో పురుషులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలాగే, మన సంస్కృతిలో పురుషుల నుంచి ఎప్పుడూ బలమైనవారిగా ఉండాలని ఆశించబడుతుంది. వారు భయపడకూడదు, బాధపడకూడదు, ఏ సమస్యలైనా ఒంటరిగా ఎదుర్కొనాలి అనే భావన అలవాటు అయిపోయింది. తమలోని అసహనాన్ని, ఆందోళనను ఇతరులకు తెలియజేయడం వల్ల వారిని బలహీనులుగా చూస్తారని చాలా మంది భావిస్తారు. ఫలితంగా, వారిలో దాచి పెట్టుకున్న భావోద్వేగాలు పెరిగి, ఒక దశలో భయంకరమైన నిర్ణయాలకు దారి తీస్తాయి.
ఆత్మహత్యలు అందులోనూ పురుషుల విషయంలో అయితే మరో ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు. మహిళలు మనసులో ఉన్న బాధలను వ్యక్తపరచడానికి, విన్నపం చెప్పడానికి ఎక్కువ అవకాశాలు కలిగినప్పటికీ, పురుషులు అలాంటి సహాయం పొందే పరిస్థితి ఉండదు. మనసులో ఏదైనా బాధ ఉంటే, మగాడివి , నువ్వే ధైర్యంగా ఉండాలి, ఆడదానిలా ఆ ఏడుపు ఏంటి అంటూ కొట్టిపడేస్తారు. అందువల్ల సమస్య వచ్చినప్పుడు వేరే వ్యక్తుల సహాయం తీసుకోవడం కూడా మగవారే కాదు వారి చుట్టూ ఉండేవారు కూడా అవమానంగా భావిస్తారు.
సామాజిక ఒత్తిళ్లతో పాటు, సంబంధాల్లో సమస్యలు కూడా పురుషులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రేమలో విఫలం కావడం, విడాకులు, కుటుంబ సమస్యలు—ఇవి మానసిక స్థితిని దెబ్బతీసి ఆత్మహత్య దిశగా నడిపించవచ్చు. ముఖ్యంగా, పిల్లలను చూడలేకపోవడం, కోర్టు వ్యవహారాల్లో తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వంటి అంశాలు, విడాకుల తరువాత పురుషులను తీవ్ర ఒంటరితనానికి గురిచేస్తాయి. ఇంకా, అల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలు కూడా పురుషుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఆత్మహత్యల రేటును పెంచే ఒక పెద్ద కారణం. ఒత్తిడిని తట్టుకోలేక, చాలా మంది మద్యం, డ్రగ్స్ వంటి విషయాల్లో నిమగ్నమై, తమ మనస్తాపాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగించినా, అసలు సమస్యను తీవ్రతరం చేస్తాయి.
అసలు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, ఆ ప్రభావం వారి పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, స్నేహితులు, సహచరులపై పడుతోంది. ఎంతోమంది పిల్లలు అనాథలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఒక వ్యక్తి బలన్మరణానికి పాల్పడితే, దానివల్ల 135 మంది దాకా ప్రభావితం అవుతారని గతేడాది అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. ఆత్మహత్యలు.. బాధితుల కుటుంబ సభ్యులతో పాటు, వారి సన్నిహితులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాట. మరి ఇలాంటప్పుడు ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని ఎలా గుర్తించాలంటే. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరి తనాన్ని ఇష్టపడటం, నిరాశా నిస్పృహలు, ప్రతి విషయం గురించీ ప్రతికూలంగా ఆలోచించటం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, అతను ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.
ఈ సమస్యను పరిష్కరించాలంటే, మన సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యాన్ని గుర్తించి, వారిని తమ భావోద్వేగాలను వెలిబుచ్చేలా ప్రోత్సహించాలి. వారికి అవసరమైన మానసిక సహాయం అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా, “పురుషుడు బలహీనత చూపకూడదు” అనే అపోహను తొలగించాలి. సహాయం కోరడం ఓడిపోవడం కాదు, అది బలమైన నిర్ణయం. మనుషులు బలమైనవారు మాత్రమే సహాయం కోరే ధైర్యాన్ని చూపగలరు. అని తెలియజెప్పటం ద్వారానే ఒక వ్యక్తిని ఆత్మహత్య ఆలోచనల నుంచి కాపాడగలరు.