స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మాట తీరు, కట్టు బొట్టు నుంచి ఆమె సింప్లిసిటీ, వ్యక్తిత్వాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే తాజాగా తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.
ఖానే మే కౌన్ హై’ అనే యూ ట్యూబ్ సిరీస్‌లో భాగంగా ఆవిడ తాజా ఎపిసోడ్‌లో కనిపించారు. ఆ ఎపిసోడ్‌లో తాను స్వచ్ఛమైన శాఖాహారిని అని గుడ్లు, వెల్లుల్లిని కూడా తినను అని.. తనకు భయం కలిగించే అంశం ఏంటంటే శాఖాహారం, మాంసాహారం రెండింటికీ కూడా ఒకటే చెంచా వాడటం తన మనస్సుని బాధిస్తుందని’ చెప్పుకొచ్చారు. ‘విదేశాలకు వెళ్లినపుడు శాఖాహార రెస్టారెంట్ల కోసం వెతుకుతానని తన భోజనం తానే రెడీ చేసుకుంటానని.. అవసరమైనపుడు తన వెంట ఆహారం తీసుకువెడతానని’ కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు షేర్ చేశారు. ఇంటి నుంచి ఆహారం తీసుకువెళ్లడం నిజంగా మంచి పద్ధతి అని కొందరు అంగీకరించగా.. మరికొందరు విభేదించారు.
“వ్యక్తులను వారి ఆహార అభిరుచులను బట్టి అంచనా వేయకూడదు.. గౌరవంగా చూడటంపై దృష్టి పెట్టాలి’ అని కొందరు ..‘ఫారిన్ ట్రిప్స్‌లో సుధా మూర్తి తన ఇంటిని తన వెంట తీసుకెళ్తుంటుంది, ఆ హోటల్ గదిని వేరే వ్యక్తి వాడితే ఎలా ఉంటుంది?’ అని మరొకరు సరదాగా జోడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.