ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. పెన్షన్ అందుకున్న వృద్ధులు వికలాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల హామీలో భాగంగా వివిధ రకాల పెన్షన్లను అందిస్తున్నామని నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసుర ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ మేరకు డోన్ మండలం కొచ్చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ అందించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చిందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని ప్రజలకు తెలిపారు.
పల్నాడు జిల్లాలోనూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజిరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కలెక్టర్ బాలాజిరావు, ఎమ్మెల్యే అరవింద బాబు లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. గ్రామాల్లో పెద్దవాళ్ళకి, భూమి లేని వారికి రెండు సెంట్ల స్థలం, ఇళ్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు.
విజయనగరం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కంటోన్మెంట్ చాకలి వీధిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగురాలు ఏలూరు శ్రీదేవికి పింఛను అందజేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పండుగ వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. దీంతో పెన్షన్ దారులు సంతోషం వ్యక్తం చేశారు.
దేశంలో సంక్షేమానికి శ్రీకారం చుట్టిన మహానేత ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు కొనియాడారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుస్తూ, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. పేద ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ నినాదంతో టీడీపీని ఎన్టీఆర్ ప్రారంభించారని చెప్పారు. అప్పట్లోనే ఎన్టీఆర్ నెలకు 35 రూపాయలతో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభించి, పేదలను ఆదుకున్నారని అన్నారు.