భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీను అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నిన్న ఉదయం నుంచి కనిపించని SI.. రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు. స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది SIని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ తరలించారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో ఐదు నెలలుగా SIగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నిన్న ఉదయం 8 గంటలకు స్టేషన్ కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారులో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రెండు సెల్ నంబర్లకు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది.. CI జితేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట ఆటవీ ప్రాంతంలో ఆయన సెల్ స్విచ్చాఫ్ అయిందని గుర్తించారు. రాత్రి పదిన్నర గంటల వరకు కూడా SI ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా SIపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్టేషన్లోని సిబ్బందికి, SIకి మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. ఈ క్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా SI శ్రీను నాలుగు రోజులు సెలవులో వెళ్లి గత బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది.