స్వతంత్ర వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు బత్తులరగూడెంలో టీడీపీ నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ నేతలు, శ్రేణులు స్టేజీపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా స్టేజీ కుప్ప కూలింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. టీడీపీ ఇంఛార్జ్ ముద్రబోయిన, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ మరి కొంతమంది ప్రజా ప్రతినిధులు అందరూ నూజివీడు బత్తులరగూడెంలో నిర్వహించిన సభలో స్టేజీపై ఆసీనులు అయ్యి ఉన్నారు. ఈ క్రమంలో స్టేజిపై చినరాజప్ప ప్రసంగిస్తుండగా.. బలమైన ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా స్టేజీ కుప్ప కూలిపోయింది. దీంతో స్టేజీ పై ఉన్న వారంతా చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్, ఇతర టీడీపీ నేతలు సహా.. స్టేజ్‌పై ఉన్నవారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఊహించని ఘటనతో షాక్ తిన్న టీడీపీ నేతలు.. వెంటనే తేరుకొని స్టేజ్ కుప్పకూలడంతో కిందపడిపోయిన నేతలను పైకి లేపే ప్రయత్నం చేశారు. కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తుండగా.. ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.