26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

ప్రభుత్వాలు మారినా మారని శ్రీశైలం నియోజకవర్గం

       శ్రీశైలం పేరు చెప్పగానే మహాశివుని పుణ్యక్షేత్రంగా అందరికీ గుర్తుకు వస్తుంది. శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి దేవాలయం దశ భాస్కర క్షేత్రాలలో ఆరవదిగా చెబుతారు. అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండోది. ఇక అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవదిగా కీర్తిస్తుంటారు. ఇక్కడే శ్రీశైలం బహుళార్థక సాధక ప్రాజెక్టు ఉంది. అంతేకాదు మహా నంది క్షేత్రం సమీపంలోనే ఉంది. సినిమా షూటింగులు జరిగే నల్లమల అడవులు, అభయారణ్యం అన్నీ ఉన్నాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీశైలం నియోజకవర్గం ముఖచిత్రాన్ని పరిశీలిద్దాం.

       శ్రీశైలం నియోజకవర్గం అంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇక్కడ ఎక్కువగా కన్పిస్తాయి. 1978లో శ్రీశైలం ఆత్మకూరు నియోజక వర్గంలో భాగంగా ఉండేది. అ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో కొత్తగా శ్రీశైలం నియోజక వర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి విజయం సాధిస్తే, 2014,2019లో వైసీపీ అభ్యర్థులు బుడ్డా రాజశేఖరరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించా రు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఏర్పడిన నాటి నుంచీ రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యమే కన్పిస్తోంది. ఆత్మకూరులో భాగంగా ఉన్నప్పుడు గెలిచిన వెంగళరెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి మంత్రులుగా పనిచేశారు.

    నియోజకవర్గంలో.. శ్రీశైలం, అత్మకూరు, వెలుగోడు, బండి అత్మకూరు, మహానంది అనే ఐదు మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 1 లక్షా 93 వేల 962 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 94 వేల 910 మంది, మహిళా ఓటర్ల సంఖ్య 99 వేల 009 మంది, ఇతరులు 43 మంది ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 38 వేల 698 ఓట్ల తేడాతో వైసీపీ కేండిడేట్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అదే జనసేనకు సుమారు 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తుండడంతో ఫలితం ఎలా ఉంటుందోనని లెక్కలు వేస్తున్నారు అన్ని పార్టీల నేతలు.

      దివంగత ముఖ్యమంత్రి NT రామరావు శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ల ద్వారా వెలుగోడు సమీపంలో ఓ రిజర్వాయర్ నిర్మించారు. ఇక్కడి నుంచి కడప, తిరుపతి, చెన్నై నగరాల కు కాలువల ద్వారా తాగునీటిని అందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ కు నీరు తీసుకువెళ్లే పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సీఎం జగన్‌ హయాంలో వెలిగొండ సొరంగ మార్గాలను పూర్తి చేసి రాయలసీమ జిల్లాలకు నీరందించనున్నారు. అలాగే మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయంలోని పుష్కరణుల ద్వారా బయటకు వచ్చే నీటితో మండలంలో అరటి, పసుపు తదితర పంటలను రైతులు సాగు స్తున్నారు. వీటిని పక్క రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, తెలంగాణా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లను అటు, ఇటుగా వాడేయడమే కాదు, బ్యాక్ వాటర్ నుంచి కూడా నీళ్లు తీయడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. శ్రీశైలంలో ఎక్కువ శాతం నీటిని ఏపీ వాడేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గోదావరి నీటిని తెలంగాణ వాళ్లు ఎక్కువగా వాడుతున్నారని ఆంధ్రావాళ్లు తమ వాదన విన్పిస్తున్నారు. మొత్తంగా నీటి గొడవలు రెండు రాష్ట్రాల మధ్య హాట్‌టాపిక్‌గా మారాయి.

      శ్రీశైలం నియోజకవర్గంలో ప్రధాన సమస్య సున్నిపెంట గ్రామం. దీనిని గ్రామ పంచాయతీగా గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. పేరుకే పంచాయితీ అంటారు. ఇక్కడ కాలనీ మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు మెయింటి నెన్స్ డివిజన్ పరిధిలోకి వస్తోంది. ఇక్కడ నుంచే రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందిస్తున్నా.. ఇక్కడి ప్రజలు మాత్రం గుక్కెడు నీటి కోసం అలమటిస్తుంటారు. శ్రీశైలం రిజర్వాయర్ భద్రత పేరిట డ్యామ్ సేప్టీ అధికారులు పరిశీలించటం, నివేదికలు సమర్పించటం అనవాయితీగా మారింది. ప్రపంచ బ్యాంకు రుణాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. అవి వస్తే పనులు ప్రారంభిద్దామని అనుకుంటున్నారు. పనిలో పనిగా ప్రాజెక్టు సమీపంలోని సున్నిపెంట గ్రామ సమస్య కూడా పరిష్కరించాలని అడుగుతున్నారు. డ్యాం వద్ద కొన్ని కీలకమైన పనులు పెండింగ్ లో ఉన్నాయి. రేడియల్ క్రస్ట్ గేట్లు, రోప్ లు, ప్లంజ్ పూల్, ప్రధానంగా కింది భాగంలో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారుతోంది. దశాబ్దాలుగా దీనిని అలాగే వదిలేస్తున్నారు. ఇంకా గేట్ల మరమ్మతులు, భద్రత పరంగా నిపుణులు సూచించిన ప్రకారం పనులు చేపట్టడానికి 135 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.

       దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఇక్కడే నల్లమల కొండల్లో కొలువుదీరి ఉన్నాడు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారి శక్తి పీఠం ఇక్కడే ఉంది. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మహా శివరాత్రి రోజున జరిగే బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో నిత్యం నల్లమల గిరులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఇంకా ఉగాది పర్వదినం రోజున రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేలాదిగా తరలివచ్చే భక్తులకు వసతి గదుల కొరత ప్రధాన సమస్యగా మారింది. నిధులున్నా భూ సమస్య కారణంగా కాటేజీ నిర్మాణ పనులు మొదలు కాలేదు.

      మరో చారిత్రాత్మకమైన అలయం ఈ నియెజకవర్గ పరిధిలోనే ఉంది. అదే మహా నందీశ్వర స్వామి ఆలయం. నల్లమల కొండలకు తూర్పున మహానంది ఉంది. మహానందికి 15 కిమీ దూరంలో నవ నందులుగా పిలిచే తొమ్మిది పుణ్య క్షేత్రాలున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఒక పుట్టలో స్వామివారికి ఆవు పాలు ఇస్తుంటే, యజమాని కొట్టడంతో స్వామివారికి గాయమైంది. అందుకే ఇక్కడ స్వామివారు కాస్త అణిగినట్టు కనిపిస్తారని చెబుతారు. ఇక్కడ జలం శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపిస్తుంది. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా పుష్కరిణిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఇంకి పోవని అంటారు. నిరంతరం ఒకే ఎత్తులో ప్రవహిస్తూ చుట్టు పక్కల 3 వేల అరటి, పసుపు తోటలకు సాగు నీరుగా ఉపయోగపడు తోంది.ఇక్కడ పుణ్యక్షేత్రం ఉంది. భక్తులందరూ వెళతారు, స్వామిని దర్శించుకుంటారు, ఇంటికెళ్లిపో తారు. అలాగే.. ఇక్కడ ప్రాజెక్టు ఉంది. అధికారులు వస్తారు, నివేదికలు తయారు చేస్తారు, పంపిస్తారు, వారు వెళ్లిపోతారు. కానీ, ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు ఇంకా ఎన్నో ఇక్కడ కనిపిస్తున్నాయి. రాత్రిపూట ఉండాలనుకునే వారికి కాటేజీలున్నా, భోజన సౌకర్యాల్లేవని అంటున్నారు. పర్యాటక శాఖ స్పందించి అరకులోయను అభివృద్ధి చేసిన రీతిలో ఇక్కడా చేయాలని కోరుతున్నారు.

         అత్మకూరు వన్యప్రాణి అభయారణ్యం శ్రీశైలం నియోజకవర్గంలోనే ఉంది. పర్యాటకుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాటేజీలు కూడా నిర్మించారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని తిలకించేం దుకు సఫారీ వాహనాల్లో పర్యాటకులను తీసుకువెళతారు. రుద్ర కోటీశ్వరం, ఓంకారేశ్వరం, నల్లమల ద్వారా శ్రీశైలానికి కాలినడకన వెళ్లే నాగులుటి వీరభద్రాలయం, భీముని కొలను,పెద్దపులుల సహజ అవాస పునరుత్పత్తి కేంద్రం ఇక్కడ చూడతగిన ప్రాంతాలని చెప్పవచ్చు. ఇక, నిత్యం సినిమా షూటింగులతో నల్లమల అటవీ ప్రాంతం కళకళలాడుతుంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్, యూట్యూబర్స్ ఇలా ఎంతో మంది వస్తూపోతుండడంతో నల్లమల అటవీ ప్రాంతం సందడిగా కన్పిస్తుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో అంచనాకు మించి వరద వచ్చింది. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి భారీగా ప్రవాహం రావడంతో… ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమనాలు వ్యక్తమైనా, ఎలాంటి ఉపద్రవం చోటు చేసుకోలేదు. దీంతో అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే..కుడిగట్టు విద్యుత్ కేంద్రానికి కొంచెం నష్టం వాటిల్లింది. దీంతో.. యుద్దప్రాతిపదిన మరమ తులు చేపట్టి యథాతథ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికి ప్రాజెక్టు 60 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం.

       శ్రీశైలం నియోజకవర్గంలో అశించిన స్టాయిలో అభివద్ది జరగలేదు. ప్రధానంగా ప్రాజెక్టు రిజర్వాయర్ మరమత్తుల పనులు చేయలేదు. సున్నిపెంట గ్రామపంచాయితీగా గర్తించినప్పటికీ అక్కడ పాలక మండలి ఎన్నికలు జరగలేదు. ప్రాజెక్టు పరిధిలోని భూములు , స్టలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడే లేడు. వెలుగోడు రిజర్వాయర్ పనులు, నల్లమల ఘాట్ రోడ్డు విస్తరణ పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. దశాబ్దాల తరబడి ఇవి అలాగే ఉన్నా, ఐదేళ్లకు ఒకసారి ప్రజాప్రతి నిధులు ఎన్నికవుతున్నా, వారి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు న్నాయి. మొత్తంగా చూస్తే.. శ్రీశైలం నియోజకవర్గం పైకి కనిపించేంత అందంగా లేదనేది అందరూ చెబు తున్న మాట. ఐదేళ్ల క్రితం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారు అప్పుడెలా ఉందో, ఇప్పుడు అలాగే ఉంది, ఏ మార్పు లేదని చెబుతుంటారు. నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి మా బతుకులు ఎప్పుడు మారతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Latest Articles

తెలంగాణ గడ్డపై త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది ?

    తెలంగాణలో నువ్వా నేనా అన్న రేంజ్‌లో పార్లమెంట్ ఫైట్‌ నడుస్తోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే గెలుపు మాదంటే మాదని ఢంకా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్