24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

రెండు లక్షల మంది విద్యార్థులతో సేవా కార్యక్రమాలు

  • ఆ లక్ష్యంతో భారీ ప్రణాళికలు
  • విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వర్‌ రావు
  • శిశుమందిర్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వెల్లడి
  • శారదా ధామంలో ఘనంగా వేడుకలు

రెండు లక్షల మందికి పైగా ఉన్న సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులను సామాజిక సేవలో పాల్గొనేలా క్రియాశీలకంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితుల్లో తమ విద్యార్థులను మంచిమార్పును సృష్టించే సంఘటనా శక్తిగా కార్యోన్ముఖం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.

శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణజయంతి ఉత్సవాల్లో భాగంగా..

హైదరాబాద్‌ బండ్లగూడలోని శారదాధామంలో పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్రస్థాయి మహాసమ్మేళనం నిర్వహించారు. అత్యంత ఉత్సాహభరితంగా జరిగిన ఈ సమ్మేళనానికి మణిపాల్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ మరియు శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్‌ తిరుమలరావు , ఏబీవీపీ పూర్వ జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావు ఆత్మీయ అతిథిగా పాల్గొని మార్గనిర్దేశనం చేశారు.

ఈ సమ్మేళనానికి తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ఆత్మీయ పూర్వకంగా సాగిన ఈ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చామర్తి ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ బలహీనపడుతోన్న సాంస్కృతిక సంపదను తిరిగి పటిష్టం చేసుకునేలా సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థుల్లో జాతీయ దృష్టికోణం మెరుగుపడాలని ఆకాంక్షించారు.
ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదన్నారు.

శిశుమందిరాలపై విష ప్రచారం : లింగం సుధాకర్‌ రెడ్డి
విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటనా మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన తీరుని శక్తిమంతంగా వివరించి చెప్పారు. ప్రస్తుతం ఈ పూర్వ విద్యార్థలు దాదాపు అన్ని రంగాల్లోనూ ప్రముఖ స్థానాల్లో ఉన్నారని చెప్పారు. శిశుమందిరాల్లో సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఆ సంస్కారమే జాతీయ భావనకు పునాది అని ఆయన అన్నారు. ఒకప్పుడు రామాయణ, భాగవతాల వంటి పురాణాల్లో మాతృమూర్తుల గొప్పతనం గురించి నేర్చుకున్నామని.. కానీ, నేటి సీరియళ్లు, సినిమాల్లో మహిళలను విలన్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ స్కూల్లో ఎక్కువ ఫీజు కడితే పిల్లలకు చదువు అంత బాగా వస్తుందన్న భావనలో పడిపోయిన తల్లిదండ్రులు.. పిల్లల పెంపకంలో తమవంతుగా ఏం చేయాలన్న బాధ్యతను మరిచిపోతున్నారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు విద్యారంగం బాగా నష్టపోయిందని, ఇకనైనా విద్యావిధానాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శిశుమందిరాల అభివృద్ధిని సహించలేని కొందరు ఇక్కడి బోధన గురించి విషప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులమీద ఉందని గుర్తు చేశారు. రాబోయే రెండేళ్లలో దేశం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోందని, జాతీయవాద శక్తులను ఏకం చేసి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందన్నారు.

పూర్వ విద్యార్థులకు సన్మానం

పూర్వ విద్యార్థులు డీసీపీ రావుల గిరిధర్‌, కో ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ సభ్యురాలు కిరణ్మయి తదితరులను ఈ సందర్భంగా వేదికపై సన్మానించారు. పూర్వ విద్యార్థి పరిషత్ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌ పరిషత్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. పూర్వ విద్యార్థులు తాము చదివిన పాఠశాలలను అన్ని వనరులతో ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన పూర్వ విద్యార్థులతో శారదా ధామం సందడి గా మారింది.

ఈ కార్యక్రమంలో విద్యాభారతి ప్రాంత సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాసరావు, క్షేత్ర సేవా ప్రముఖ్‌ కుందూరు విద్వాన్‌రెడ్డి, క్షేత్ర ప్రశిక్షణా ప్రముఖ్‌ రావుల సూర్యనారాయణ, విద్యాభారతి ఉచ్ఛ శిక్షా సంస్థాన్‌ అఖిలభారత అధ్యక్షుడు మురళీమనోహర్‌, పూర్వ విద్యార్థి పరిషత్‌ అధ్యక్షుడు హరిస్మరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సమ్మేళనంలో శిశుమందిర్‌ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, గీతాలు అందరినీ అలరించాయి. మధ్యాహ్నం నిర్వహించిన సదస్సులో భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

Latest Articles

మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత

హీరో మోహన్‌ బాబు కుంటుంబ రచ్చకు ఇంకా ఫుల్‌ స్టాప్‌ పడలేదు. ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలో మోహన్‌ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్