దేశవ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఆరో దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరుగుతు న్నాయి. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణాల్లోని అన్ని నియోజకవర్గాలకు ఆరో దశలోనే ఓటింగ్ పూర్తి కానుంది.
ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి, జార్ఖండ్ – 4, ఒడిశా – 6, పశ్చిమ బెంగాల్‌లో – 8 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు ఉన్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీలో 7 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అన్నింటా బీజేపీ, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్యే పోరు జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. బీజేపీ అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. ఢిల్లీలో ఎన్నికల విధుల్లో 33వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఎండల దృష్ట్యా ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.


