TSPSC పేపర్ లీకేజీ కేసులో నిందితులను విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు బ్లాక్ టికెట్స్ మాదిరిగా విక్రయించినట్లు సమాచారం. షాద్ నగర్ కు చెందిన రాజేందర్ అనే వ్యక్తి నిందితుడు డాక్యా నాయక్ దగ్గర రూ.10లక్షలకు ప్రశ్నాపత్రాన్ని కొనుకున్నాడు. తన రూ.10లక్షలను తిరిగి రాబట్టుకునేందుకు అతను మరో వ్యక్తిని పేపర్ ను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇలా ఒకరి ద్వారా ఒకరికి దాదాపు వంద మందికి పేపర్ లీక్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్లుగా గుర్తించారు.
ఇక ఈ కేసులో గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కుల కంటే ఎక్కువ సాధించిన 20 మంది అభ్యర్థుల వివరాలను కూడా సేకరించారు. ఈ 20మందిలో కొందరికి నిందితులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అటు పేపర్ లీకేజీ ఘటనతో TSPSC దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆఫీస్‌లోకి సెల్‌ఫోన్‌లు, పెన్‌డ్రైవ్‌లు తీసుకురావడంపై నిషేధం విధించింది. ఇకపై అభ్యర్థుల నుంచి ఏ ఫిర్యాదు అయినా ఆన్‌లైన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది.