మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. ప్రేమతో రాసి ఇచ్చిన ఆస్తులు తిరిగి ఇవ్వాలంటూ చెల్లెలు షర్మిలకు జగన్ ఆగస్టు 27న రాసిన లేఖకు ఘాటుగా కౌంటర్ ఇస్తూ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల లేఖాస్త్రం సంధించారు. ఉమ్మడి ఆస్తుల్లో తన నలుగురు మనవళ్లకు సమాన వాటాలు దక్కాలన్నదే తన తండ్రి వైఎస్ఆర్ ఆకాంక్ష అని లేఖలో తెలిపిన షర్మిల.. ప్రేమ ఆప్యాయతలతో బదిలీ చేసిన ఆస్తులను ఎలా అడుగుతారని నిలదీశారు. తండ్రి వైఎస్సార్ ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటుంటే జగన్ మాత్రం ఆస్తులపై కన్నేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్‌కు తల్లీకూతుళ్లు రాసిన లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఆ లేఖను తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం కలకలం రేపింది. జగన్ వ్యక్తిగత విషయాలపై టీడీపీ స్పందించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆస్తి పంపకాలపై వైఎస్ జగన్ కేసు దాఖలు చేయడంతో షర్మిల, విజయమ్మ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. లేఖలో జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కుటుంబ బంధానికి విలువనిస్తే జగన్ మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి వైఎస్సార్ ఆదేశాలకు తూట్లు పొడుస్తున్నారని జగన్‌పై షర్మిల, విజయమ్మ మండిపడ్డారు.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల పంపకాల వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతోపాటు పలువురిని చేర్చారు. అయితే ఇదే విషయంపై గతంలో మాజీ సీఎం జగన్ కు తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ ఆవేదనతో రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ లేఖపై టీడీపీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విమర్శల వర్షం కురిపించింది టీడీపీ. మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు నీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవడానికి సిద్ధమయ్యావా జగన్ మోహన్ రెడ్డి? అంటూ రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌తో జగన్ కుటుంబం, ఆస్తి వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది.