స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు కర్ణాటకలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరి చేత గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు 8 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మొత్తం ఎనిమిది మంది మంత్రుల్లో ఆరుగురు సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారు కాగా.. డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఒకరికి మాత్రమే అవకాశం లభించింది.
ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. కాగా ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. 13న ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాలు గెల్చుకుని అధికారం హస్తగతం చేసుకుంది.