ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. గత కొన్ని వార్తల్లో నిలుస్తున్న పొత్తుల పంచాయితీకి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది. దాదాపు ఆరేళ్ల తరువాత ఎన్డీయేలోకి టీడీపీ రీ ఎంట్రీ ఖాయమైంది. దీంతో రానున్న ఎన్నికల్లో మళ్లీ 2014 సీన్ రిపీట్ కానుంది.
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పని చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. ఇక జనసేన విషయానికొస్తే ఆ పార్టీ 24 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయను న్నట్లు తెలుస్తోంది.అయితే ఈ పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయ వాడ తిరిగి వచ్చిన తర్వాత, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి అభ్యర్ధుల జాబితాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 17న చిలుకలూరిపేటలో టిడిపి, జనసేనలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించి దానిలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించబోతున్నాయి. ఇప్పుడు వాటితో బీజేపీకి పొత్తు కుది రింది కనుక ఈ సభలో బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ, దాన్ని సాధించడానికి ఎన్డీయే పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీకి ఆహ్వానం అందడంతో మార్చి 14వ తేదీన జరగబోయే ఎన్డీయే సమావేశానికి టీడీపీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని.. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయిం చాయలని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు. పార్టీల బలాబలాల మేరకు పోటీచేసే స్థానాలను త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. బీజేపీతో పొత్తు అధికారం కోసం కాదని, రాష్ట్రం భవిష్యత్తు కోసమేనని కనకమేడల స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.మొత్తానికి ఎన్నికల వేళ..ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని..సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని చెబుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.


