స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్, తదుపరి పరిణామాలపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక కుట్రకు పాల్పడినందుకు చంద్రబాబుకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, ఈడీ, జీఎస్టీ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తామని, సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబును ముందుగా అరెస్ట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.
లోకేష్‌ను కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని, ఆయన సన్నిహితుడు కిలారు రాజేశ్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.550 కోట్ల స్కామ్ జరిగిందని, నిధులు కాజేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తించామన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గంటా సుబ్బారావును ఎండీ, సీఈవోగా నియమించారన్నారు. ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షెల్ కంపెనీలకు రూ.371 కోట్లు విడుదల చేశారన్నారు. విచారణలో చంద్రబాబు ప్రధాన లబ్ధిదారుడిగా తేలిందని, ప్రభుత్వ ధనాన్ని షెల్ కంపెనీల ద్వారా చేసిన కేసులో చంద్రబాబు ముఖ్య కుట్రదారుడిగా ఉన్నారని సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పారు.