ఎన్డీయే కూటమిలో సరికొత్త అంశం కాక రేపుతోంది. నారా లోకేశ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కార్చిచ్చులాగా మారింది. తాజాగా ఆ వివాదానికి మంత్రి టీజీ భరత్ మరింత ఆజ్యం పోశారు. ఏపీకి ఫ్యూచర్ సీఎం నారా లోకేశ్ అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అది కూడా చంద్రబాబు ముందే వ్యాఖ్యానించడం టీడీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. లోకేష్‌కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న వేళ.. మంత్రి టీజీ భరత్ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. ప్రస్తుతం టీడీపీలో పార్టీలో గట్టిగా వినపడుతున్న డిమాండ్ ఇది. పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో మొదలుపెట్టి పిఠాపురం వర్మ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, లాంటి వాళ్ళు ఈ డిమాండ్ ను గట్టిగా వినిపించారు. ఒకవైపు హై కమాండ్ ఈ విషయంపై సైలెంట్ గా ఉండమని సూచించినప్పటికీ నేతలు ససేమిరా అంటున్నారు. ఈ విషయంపై ఎవరూ మాట్లాడవద్దని సంకేతాలు వెళ్లిన కొద్ది గంటలకే దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తర్వాత ఫ్యూచర్ సీఎం లోకేషేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లైంది.
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబుతోపాటు నారా లోకేశ్ ఇతర బృందంతో మంత్రి టీజీ భరత్ వెళ్లారు. దావోస్ చేరుకున్నాక జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైక్ అందుకున్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాకు కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ ప్రకటించారు. ఎవరికీ నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్‌లో కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ టీబీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్‌కు పోటీగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్న వేళ అనూహ్యంగా సీఎం రేసులో లోకేశ్‌ను నిలబెట్టడం ప్రాధాన్యత సంచరించుకుంది. అదీ..చంద్రబాబు ముందే లోకేష్ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కూటమి పార్టీలతో పాటు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అయితే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు ఎలా కోరుకుంటున్నారో, అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి.
మరోవైపు నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తనతోపాటు లోకేష్ కూడా ఉన్న వేదికపై ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి వేదికపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీజీ భరత్‌పై చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి టీజీ భరత్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.
మొత్తానికి నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు తెరపైకి తెచ్చిన డిమాండ్లతో కూటమి పార్టీల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. అయితే ఇదే అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోందనే సంకేతాలు కనపడుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమి పార్టీల్లో విభేదాలు వస్తే.. దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.