స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు విషయాలలో చాలా బిజీగా ఉన్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డికి కీలక బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు సర్దుబాటు చేయడం, ఎవరైనా సీట్ ఇవ్వలేదని అలిగితే వారిని బుజ్జగించడం లాంటి కీలక కర్తవ్యాలను జానా రెడ్డికి ఇచ్చింది. ఇందుకోసం కాంగ్రెస్ ఫోర్ కమిటీ ని ఏర్పాటు చేసింది.. ఈ కమిటీకి జానా రెడ్డి చీఫ్ గా ఉంటారు. ఇంకా ఈ కమిటీలో మాణిక్ రావ్ ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ లాంటి నేతలు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీట్ల ఎంపిక విషయంలో అసంతృప్తి వస్తుండడంతో అధిష్టానం వెంటనే స్పందించి ఈ కమిటీని నియమించింది. కాగా పూర్తి స్థాయిలో ఇంకా కాంగ్రెస్ తమ అభ్యర్థుల వివరాలను వెల్లడించలేదు.