స్వతంత్ర వెబ్ డెస్క్: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎ14గా వున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సిఐడి మంగళవారం నాడు సుమారుగా ఆరు గంటల పాటు విచారించింది. ఈ సమయంలో దాదాపు 50 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. నేడు (బుధవారం) కూడా విచారణ కొనసాగనుంది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఎపిసిఐడి క్యాంప్ కార్యాలయంలో నారా లోకేష్ విచారణకు హాజరైనారు. ఈ కేసులో నారా లోకేష్ పాత్రకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గంట పాటు భోజన విరామాన్ని ఇచ్చారు. విరామం అనంతరం తిరిగి 2 గంటలకు విచారణను ప్రారంభించి సాయంత్రం 5గంటలకు విచారణను ముగించారు.
విచారణ ముగిశాక మరికొన్ని అంశాలపై విచారించాల్సి వుందని బుదవారం కూడా విచారణకు రావాలనే అక్కడే నారా లోకేష్‌కు 41ఎ నోటీస్‌ను సిఐడి అధికారులు అందజేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. సీఐడీ విచారణ గురించి పలు విషయాలు చెప్పారు. గత నెల 30న 41ఎ కింద తనకు సిఐడి అధికారులు ఇన్నర్ రింగ్‌రోడ్‌కు సంబంధించి విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారన్నారు. విచారణ సందర్బంగా సిఐడి అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ప్రశ్నలు వేశారని అన్నారు. 49 ప్రశ్నలు గూగుల్‌లో సెర్చ్ చేసినా దొరికే తన వ్యక్తిగత సమాచారం అడిగారని, ఇన్నర్ రింగ్ రోడ్‌కు సంబంధించి ఒక్క ప్రశ్న మాత్రమే అడిగారని తెలిపారు.
ఎలాంటి ఆధారాలు తన ముందు వుంచలేదన్నారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో తాను, తన కుటుంబసభ్యులు ఎలా లాభపడ్డారో అన్న అంశంపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదన్నారు. ఇది కక్షసాధింపు తప్ప మరొకటి కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేని కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం దొంగ ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేస్తోందన్నారు. ఎన్ని ప్రశ్నలు అయినా అడగండి ఎంతలేట్ అయినా వుంటానని, నాకు రేపు వేరే పని ఉందని చెప్పినా, రేపు మళ్లీ ఉదయం 10 గంటలకు విచారణకు రమ్మన్నారు. బుధవారం కూడా తాను విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. అవగాహన లేని సైకో జగన్ ఎన్నైనా మాట్లాడతాడని, ఆయన డీజీపీ దగ్గర పాఠాలు చెప్పించుకుంటే మంచిది. తెలుగుదేశం పార్టీ అంటే భయం కాబట్టే మా కార్యకర్తలు కొవ్వొత్తులు పట్టినా, విజిల్ ఊదినా కేసులు పెడుతున్నారు. గత 31 రోజులుగా సీఐడీ అధికారులు ఎలాంటి తమాషాలు ఆడారో అందరికీ తెలుసు” అని నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్చారన్నది తనపై మోపుతున్న అభియోగమని తాను మంత్రిగా ఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నానో సిఐడి చెప్పలేక పోతోందన్నారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు.
విచారణ అధికారి మార్పు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ అధికారిని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడిషన్ ఎస్‌పి జయరాజుకు బదులుగా డిఎస్‌పి విజయ్ భాస్కర్‌కు విచారణ బాధ్యతలను అప్పగించినట్లు మంగళవారం విజయవాడ ఎసిబి కోర్టుకు ప్రభుత్వం సమాచారం అందించింది. ఈ కేసులో నారా లోకేష్ విచారణకు హాజరవుతున్న రోజునే విచారణ అధికారిని మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది. అలాగే వ్యక్తిగత కారణాలతో ఎసిబి కోర్టు జడ్డి హిమబిందు మంగళవారం సెలవుపై వెళ్లారు. దీంతో చంద్రబాబునాయుడుపై సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్ల విచారణ బుధవారానికి వాయిదా పడింది.