స్వతంత్ర వెబ్ డెస్క్: పోలీసు శాఖలో ఆయా విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు సంబంధించి శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఆదివారం విడుదల చేసింది. పోలీసు ఎంపికలో అత్యంత కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు తుది జాబితాను వెలువరించింది. సివిల్, ఏఆర్, టీఎస్ ఎస్ పి, ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, ఐటీ, పీటీవో, ఎఫ్‌పీబీ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై స్థాయిలో మొత్తం 587 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఇందులో 434 మంది పురుషులు, 153 మంది మహిళలు శిక్షణకు ఎంపికయ్యారని నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం ఉదయం నుంచి అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు వారి లాగిన్ ఐడీతో వివరాలు తెలుసుకోవచ్చన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు వారిపై కేసులు, మెడికల్ అంశాలకు సంబంధించి అటెస్టేషన్‌ను ఆగస్టు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్ ప్రత్యేక ఫార్మాట్‌లో నమోదు చేయాలన్నారు. అటెస్టేషన్ కాపీని ఏ4 సైజు పేపర్లలో ప్రింట్ తీసుకుని పాస్‌పోర్టుసైజు ఫొటో అతికించి మూడు కాపీల్లో గెజిటెడ్ సంతకాలతో ఆగస్టు 14న సూచించిన కేంద్రాల్లో అందజేయాలన్నారు.
ఆయా విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో సందేహాలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకునేందుకు పోలీసు నియామక బోర్డు అవకాశం కల్పించింది. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఫార్మాట్‌లో ఉంచిన నమూనాలో అభ్యర్థులు క్లారిఫికేషన్స్ అడగవచ్చు. ఆగస్టు 7న ఉదయం 8 గంటల నుంచి 9న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఇందుకు అవకాశం కల్పించారు. క్లారిఫికేషన్స్ అడిగే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీలు రూ.2 వేలు, ఇతరులు రూ.3 వేలు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అడిగిన క్లారిఫికేషన్స్‌కు కొద్ది రోజుల్లోనే వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని బోర్డు చైర్మన్ తెలిపారు


