సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం మోగించిన టీడీపీ-జనసేన కూటమి.. ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఫస్ట్‌లిస్ట్‌లో ప్రకటించిన మేరకు టీడీపీ 94 స్థానాలకు అభ్యర్నుల్ని ప్రకటిం చగా.. పొత్తులో భాగంగా జనసేనకు మొత్తం 24 సీట్లు కేటాయించింది టీడీపీ. అయితే.. ఇందులో ఐదు సీట్లకు మాత్రమే కేండిడేట్లను ఖరారు చేశారు పవన్. త్వరలోనే బీజేపీతో పొత్తు కుదురుతుందన్న ప్రచారం నేపథ్యంలో.. మరో విడత విడుదల చేసే జాబితాలో కమలనాథులకు సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి..టీడీపీ- జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఎలా ఉంది ? అధికార వైసీపీని ఈ ఎన్నికల్లో నిలువరిస్తామని చేసిన ప్రకటనలకు తగినట్లుగానే ఉమ్మడి అభ్యర్థులున్నారా?
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చేనెల రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఏపీలో ఓవైపు అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటూ పోతుండగా.. టీడీపీ-జనసేన లిస్ట్ ఎప్పుడు ఉంటుందున్న ఉత్కఠ ఇరు పార్టీల నేతల్లోనే కాదు.. సామాన్య ప్రజానీకంలోనూ నెలకొంది. అయితే.. వారందరి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ.. టీడీపీ-జనసేన అధినేతలు… ఉమ్మడిగా అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎన్నో సుదీర్ఘ కసరత్తులు, సామాజిక సమీకరణాలు, అంగ, అర్థబలాలు.. ఇలా ఒకటేమిటి ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ 2024 చేరుకునేందుకు అవసరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉమ్మడిగా అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీ-జనసేన అధినేతలు ఒకే వేదికపై నుంచి విడుదల చేసిన ఈ ఉమ్మడి జాబితాలో మొత్తం 99 స్థానాలకు కేండిడేట్లను ఖరారు చేశారు. అయితే….పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించగా.. అందులో కేవలం ఐదు స్థానాలకు మాత్రమే జనసేనాని అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఇరు పార్టీల శ్రేణులు, నేతలు భావిస్తున్న నేపథ్యంలో… రెండో విడతలో కమలనాథులకు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం సాగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తెలుగు తమ్ముళ్ల జాబితా ఓసారి పరిశీలిస్తే… టెక్కలి నుంచి అచ్చెన్నా యుడు, హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేష్, కుప్పం చంద్రబాబు నాయుడు, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, విజయవాడ ఈస్ట్ గద్దెరామ్మోహన్ రావు బరిలో దిగనున్నారు. వీరితోపాటు కొందరు వారసులకు టికెట్లు ఇచ్చారు టీడీపీ అధినేత. కర్నూలు నుంచి టీజీ భరత్, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి సహా మరి కొందరు వారసులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించింది టీడీపీ. అయితే.. ఇందులో కేవలం ఐదు సీట్లలో మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించారు జనసేనాని పవన్ కల్యాణ్. త్వరలోనే మిగిలిన సీట్లకు కేండిడేట్ల పేర్లను ఖరారు చేయనున్నారు పవన్. ఇక, జనసేన జాబితా చూస్తే… నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, తెనాలి బరిలో నాదెండ్ల మనోహర్ దిగనున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో సామాన్యులు, రాజకీయ నేతలు సైతం ఇబ్బందులు పడినట్లు తెలిపారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిన రోజే తమ విజయం ఖరారైందన్న ఆయన… వైసీపీ ఆ రోజే కాడి పడేసిందని వ్యాఖ్యానించారు.
గెలిచే సామర్థ్యం ఉన్న నేతలనే బరిలో దింపుతున్నట్లు వెల్లడించారు జనసేనాని పవన్ కల్యాణ్. ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేసే బదులు.. తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామ న్నారు పవన్ కల్యాణ్. ఈ ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు పవన్. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తాము కొన్ని సీట్లను త్యాగం చేసినట్లు వెల్లడించారు జనసేన అధినేత పవన్. మొత్తంగా….అధికార పార్టీ అభ్యర్థుల్ని ఢీకొట్టే సమర్థత ఉన్న నేతల్ని ఎంపిక చేశామని ఇటు టీడీపీ, అటు జనసేన అధినేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయడం ఖాయమని అంటున్నారు.


