దేవర సినిమాలో ఎర్ర సముద్రాన్ని చూశాం.. అది చేపలకన్నా కత్తుల్ని నెత్తురుని ఎక్కువ చూసి ఉంటుంది. అందుకే దాన్ని ఎర్ర సముద్రం అంటారని హీరో చెబుతాడు. మరి అర్జెంటీనాలో కూడ ఓ నది అచ్చం అలాగే ఎరుపెక్కింది. మరి ఆ నది ఏం చూసింది.. ఎందుకు అది రక్తంలా మారి పారింది. దీనిపై అర్జెంటీనా ఏమంటోంది.
నరకంలో వైతరణి నది గురించి పురాణాల్లో వినే ఉంటారు. అందులో రక్తం ప్రవహిస్తుంటూ ఉంటుంది. అర్జెంటీనాలోని సరండీ నదిని చూసినా ప్రస్తుతం అదే గుర్తుకొస్తుంది. బ్యూనస్ ఎయిర్స్ నగర శివారులోని నది కూడా ఎరుపెక్కి దర్శనం ఇస్తోంది. ఉన్నట్టుంది నది ఇలా ఎర్రగా, భయానకంగా కనిపించేసరికి స్థానికులు బెంబేలెత్తిపోయారు.
సరండీ నది ఎన్నో పారిశ్రామిక వాడలు, మురికి వాడల గుండా ప్రవహిస్తోంది. చివరకు రియోడిల ప్లాటా గుండా సముద్రంలో కలిసిపోతుంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా ఈ నదిలోనే వదులుతున్నారు. ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలను కాల్చివేయగా వచ్చే మిశ్రమాలను కూడా అధికారులు ఇందులోనే కలిపేస్తున్నారు. ఫలితంగా నదిలో కాలుష్యం పెరిగి ఎర్రగా మారిపోయింది.
ఉదయం నిద్ర లేవగానే ఆ ప్రాంతంలోని ప్రజలకు భరించలేనిది ఏదో వచ్చిందని వెళ్లి చూసేసరికి వ్యర్థాలను కాల్చివేసే ఓ పరిశ్రమ నుంచి దట్టమైన పొగ వస్తున్నట్లు కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. నది వైపు చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రక్తంలా మారిన సరండీ నదిని చూసి వారు నిర్ఘాంతపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు నది నుంచి శాంపిల్స్ సేకరించారు. కాలుష్య కారకాలపై పరీక్షలు చేయిస్తున్నారు.