మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మరో 15రోజుల్లో కూలిపోబోతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 16మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు చెప్పనుంది. ఈ నేపథ్యంలో షిండే ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందని రౌత్ అన్నారు. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం కూలిపోతుందని కూడా తెలిపారు.
గతేడాది జూన్ నెలలో షిండేతో పాటు 39మంది ఎమ్మెల్యేలు శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ పొత్తు పెట్టుకున్న షిండే టీమ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అనంతరం ముఖ్యమంత్రిగా షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.