గోవా అంటే గ్రేట్ టూరిస్ట్ లకు స్వీట్ కోవా కిందే లెక్క. అయితే, గోవా మాట వరకు విదేశీ యాత్రికులకు ఓకే అవ్వవచ్చు కాని, కోవాలు, కజ్జికాయలు అంటే వాళ్లకు తెలియదు కదా..! ఇక విషయంలోకి వస్తే గోవా లో విదేశీ యాత్రికులే కాక స్వదేశానికి చెందిన చాలామంది యువతీ యువకులు, తమ రాక పోకలు తగ్గించేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి కారణం ఏమిటంటే.. అక్కడ శాఖాహారానికి గ్రేట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి.. మాంసాహారం విక్రయాలపై అశ్రద్ధ చూపుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.
గోవాలో గోంగూర, తోటకూర వంటకాలేమిటి..? ఇడ్లీ, సాంబర్, వడ అంటూ ఆ కేకలేమిటని పలువురు నోళ్లు నొక్కుకుంటున్నారు, నొసలు చిట్లిస్తున్నారు. ఇదేం చోద్యం అని మెటికలు విరుస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని, కొందరు చిరు వ్యాపారులు… గోవా బీచ్ లో ఎక్కడ బడితే అక్కడ హొటల్ మెనూలు పెట్టేసి అక్కడ ఇడ్లీ, సాంబార్ అమ్మేస్తున్నారు. మత్స్య, మాంసాలతో విందు భోజనాలు సుష్టుగా ఆరగించి.. గోవా బీచ్ లో.. తమకు మ్యాచ్ అయినవారితో కేరింతాలు కొట్టాలనుకునేవారికి .. ఈ శాఖాహార ఫలహారాలు బాధాకరంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో, ఈ బీచ్ నుంచి గాయబ్ అయిపోతున్నారని తెలిసింది.
అనుకరణలో అందెవేసిన చేయిగా పేరొందిన కొందరు యువకిశోరాలు.. విదేశీయులు వేరేచోట్ల బీచ్ లకు వెళ్లిపోతుంటే.. తాము ఈ పాక, శాక.. శాఖాహారాలకు దూరమే అంటూ.. ఫ్రెష్ మీట్ ఉండే బీచ్ ఏరియా హొటల్ మేనేజ్ మెంట్లతో మీట్ అయిపోయి.. మీట్, ఫ్రెష్ ఫిష్ కు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో బయట షాపుల యజమానుల లైసెన్స్ లు రద్దు చేయాలని గోవా పర్యాటక శాఖ.. సాక్షాత్తు ఎమ్మెల్యే కోరారు. గోవా వంటకాలను ప్రోత్సహించాలని, ఇడ్లీ, సాంబార్ అమ్మకాలు నిలిపివేయాలని ఆయన గోవా టూరిజానికి తెలియజేసినట్టు తెలిసింది.
ఏందప్పా ఇది… తామెన్నో చోట్లకు వెళ్లి తమ హోటల్ సామ్రాజ్యాలను విస్తరించి, ఎంతో ఆర్జించి….ప్రస్తుత కాల, మాన, పరిస్థితులకు అనుగుణంగా .. ఫాస్ట్ ఫుడ్స్, పావు బజ్జీలు, పిజ్జాలు, బర్గర్ సంస్కృతి వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. తమ స్వప్రదేశాల్లో విశ్రాంతి పొందుతున్నామని ఉడిపీ హోటల్ వ్యాపారులు, కన్నడీగు నల,భీమ పాక ప్రవీణులు, తమిళనాట అయ్యర్లు, తెలుగు రెస్టారెంట్ పీపుల్ చెబుతున్నారు. అయితే, తమ ఇంటా వంటా లేని పద్దతులు.. గోవా బీచ్ లు, నక్షత్ర రెస్టారెంట్ల ఎదుట.. ఇడ్లీ, సాంబార్ ల విక్రయాలతో గల్లీ వేషాలేమిటని విసుక్కుంటున్నారని తెలుస్తోంది.
కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాలో ఓ పురాతన పద్ధతులు పాటించే సంగీతం మాస్టారు ఘట్టం మనకు తెలిసిందే. సినీ సంగీత దర్శకుడి ట్రయిల్స్ కోసం ఓ లాడ్జిలో దిగడం.. తనకు కాస్ట్లీ ఫ్రెష్ ఫుడ్ స్టార్ హొటల్ నుంచి తెమ్మనడం, ఆ హోటల్ సిబ్బంది వందలాది రూపాయలు తీసుకుని…పూటకూళ్ల హొటల్ నుంచి ఇడ్లీ, సాంబార్ తేవడం..సంగీత విద్వాంసుడిగారికి కోపం వచ్చేయడం మనకు తెలిసిన విషయాలే కదా..! అంత పద్దతిగల సంప్రదాయ సంగీతం సారే.. అంతలా ఇడ్లీ, సాంబార్ లపై విముఖత చూపించే.. స్టార్ ఫుడ్, డాల్ఫిన్ వంటకాలు కోరినప్పుడు.. నవీన యువత, విదేశీయ జనత.. ఇడ్లీ, సాంబార్ ల కారణంగా.. బీచ్ లకు బీచ్ లే మార్చేయడం పెద్ద గొప్పవిషయం కాదు లెండి.. అని చాలామంది వ్యాఖ్యానించేస్తున్నారు.