పాపభీతి లేకపోతే దారుణాలు రాజ్యమేలతాయి. పుణ్యాలకు పుట్టగతులు లేకుండా పోతాయి. తననే కాదు, తనని కన్న తల్లిని వేలు పట్టుకు నడిపించి, గోరు ముద్దలు తినిపించి, విద్యాబుద్ధులు చెప్పించి, పెంచి పెద్ద చేసి, పెళ్లి, పేరంటాలు చేసి, కోట్ల రూపాయలకు వారసులను చేస్తే… ఆ వయసు మళ్లిన వృద్ధుడికి లభించిన మా గొప్ప గౌరవం ఏమిటో తెలుసా..? ఏ గొడవలతోనో.. తన బిడ్డ పుట్టింటికి వచ్చేస్తే.. పల్లెత్తు మాట అనకుండా ఆ బిడ్డకు, ఆ బిడ్డ బిడ్డకు ఏ లోటు లేకుండా.. అహర్నిశలు తాను శ్రమిస్తూ..ఆ కుటుంబాన్ని ధనవంత కుటుంబంగా తీర్చిదిద్దన ఆ తాతయ్యకు ఏం ప్రతిఫలమో తెలుసా..? మనవడి చేతిలో మరణం.
అయ్యా.. అయ్యా..ఎందుకు గొయ్య.. అని ఓ తండ్రిని చిన్న పిల్లాడైన కొడుకు అడిగితే.. ఆ తండ్రి ఇచ్చిన సమాధానం. తన తండ్రిని చావగొట్టి పాతెయ్యడానికే ఈ గొయ్య అన్నాడు. వెంటనే ఆ మనవడు.. వేరే గొయ్య తవ్వడం మొదలెడితే.. బాబూ.. నీ కెందుకురా ఈ గొయ్య అంటే… ఇదీ చావగొట్టి పారెయ్యడానికే.. మీ అయ్యకు నువ్వు చేసిన మర్యాద.. మా అయ్యకు నేను చెయ్యాలి కదా.. ఎప్పటికైనా తాతా, మనవడు ఒకటేగా అని.. తాత, మామ్మలకు అసలు కంటే వడ్డీ ముద్దు అనే విధంగా, కొసరుగా ఉండే మనవడు చెప్పిన మా మంచి సమాధానం. ఇది ఓ సినిమా ఘట్టం. తాతంటే.. కొడుక్కు ఆదరణ లేకపోయినా మనవడు తాతను ఎంతో ఆదరంగా ఆ సినిమాలో చూసుకుంటాడు. మరి ఇటీవల జరిగింది ఏమిటి. తనకు, తల్లికి కోటాను కోట్ల రూపాయలు ఇచ్చి పెంచి పోషిస్తున్న సొంత తాతను ఓ మనవడు కసితీరా పొడిచి పారేసి చంపేశాడు. కారణం ఏమిటంటే.. యూ బెగ్గర్ అని తాత తిట్టాడని ఈ ఘాతుకానికి పాల్పడ్డానని.. ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా నిర్లజ్జగా సమాధానం ఇచ్చాడు. ఏం సాధించాడు.. తన మొండి మూర్ఘత్వంపు వైఖరితో.. తన కన్న తల్లికి తండ్రి లేకుండా చేశాడు. తాను బంగారు బాతులాంటి తాతను కోల్పోయాడు. కటకటాల పాలై జీవచ్ఛవంలా మారాడు.
తనను హీనంగా చూస్తూ, ఇంట్లో, ఆఫీసులో తన తాత జనార్దనరావు అవమానించాడని, ఆస్తి పంపకాల్లోనూ తనను తక్కువ చేశారని అందుకే ఆయనను హతమార్చానని జనార్దనరావు మనవడు కిలారు కీర్తి తేజ్ ఇటీవల పోలీసు ఇంటరాగేషన్ లో వెల్లడించారు. తనకు జన్మనిచ్చిన మాతృమూర్తికే ఆయన తండ్రి. కుమార్తెపై అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు లేకపోతే…..కష్టాలపాలైన..ఆమెను, ఆమె బిడ్డను తన దగ్గరకు చేర్చుకుని…ఎంతో అపురూపంగా చూసుకునే వ్యక్తి…ఏ తప్పిదం చేసినందువల్లో, మరే ఒత్తిడి ఎదుర్కొన్న సమయంలోనో చిన్న మాట అంటే.. తమపై ప్రేమాభిమానాలు లేనట్టు, శత్రువులా చూసినట్టు భావించేయడం సబబేనా..? ఒక వేళ తాత తప్పుచేసి ఉంటే.. అది తల్లికి చెప్పి.. తన బిడ్డ మనస్సు నొచ్చుకుందని చెప్పడమో.. మరో రీతిలోనో తెలియజేసి ఉంటే.. ఆ తాత.. తన తప్పు తెలుసుకునేవాడు కాదా..! నిష్కారణంగా నిండు ప్రాణాలు తీసేసి..పండంటి తన జీవితాన్ని జైలుపాలు చేసుకోవడం ఆ మనవడికి సమంజసమా..?
ఇదీ.. ఈ మనవడి ఒక్క విషయమే కాదు. సమాజం అంతా నేరపూరితంగా ఎందుకు మారిపోతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను హతమార్చేవారు, కట్నం కోసం కట్టుకున్న భార్యను కడతేర్చేవారు, ప్రియుడి కోసం కట్టుకున్న భర్త ప్రాణం తీసేవారు, ప్రేమికురాలి కోసం భార్యను బాధించి, వధించే వారు… సూసైడ్, రెసిసైడ్, మాట్రిసైడ్, పాట్రిసైడ్, బేట్రిసైట్…… ఇలా ఎన్నో హత్యలు, అమానుషాలు అను నిత్యం జరుగుతున్నాయి. పరీక్ష తప్పితే ఆత్మహత్య, చిన్న మాటంటే హత్య, చదువుకోమంటే చంపేయడం, కొలువుకు వెళ్లమంటే కత్తితో పొడిచేయడంత…….ఇలా ఎన్నో అవాంఛనీయ ఘటనలు ఎక్కడో ఓ మూల ప్రతి రోజు జరుగుతున్నాయి.
సుభాషితాలు, శతకాలు, ఇతిహాసాలు, పురాణాలు, పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుంటే.. మానవ జీవితం విలువ, పెద్దలకు ఎందుకు విధేయులుగా ఉండాలో, పెద్దలతో ఎలా ప్రవర్తించాలో.. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు తెలిసి.. ఉన్నత విలువలతో ఉత్తమ జీవితం గడిపే అవకాశం కలుగుతుంది. నలుగురితో మంచి అనిపించుకోవడం జరుగుతుంది. భారవిః … అనే ఒక సంస్కృత కథ.. పెద్దల గొప్పదనాన్ని.. పైకి కనిపించకపోయినా పిల్లలపై పెద్దలకు ఉండే విపరీత ఆప్యాయ అనురాగ భావాలు ఈ కథ తెలియజేస్తుంది.
భారవి అనే యువకుడు అపార మేధావంతుడు. అన్నింటా ఫస్టే. ఎన్నో బహుమానాలు, ఎన్నెన్నో రాజ్య సన్మానాలు పొందుతాడు. అడుగు బయట పెట్టాడంటే చాలు… ప్రతి ఒక్కరితో ప్రశంసలు, అభినందనలు పొందుతాడు. అయితే, తాను ఇంత మేధావి అయినా, ఇన్ని పురస్కారాలు, సన్మానాలు పొందుతున్నా, బయట అందరూ అభినందిస్తున్నా.. కన్న తండ్రి మాత్రం ఒక్కసారి ప్రశంసించడు. అసాధ్యమైన పనులను సునాయాసంగా సుసాధ్యం చేసేసి.. ఔరా.. భారవి.. ఏమి నీ తెలివి, ఎంత గొప్పవాడివి అని సాక్షాత్ ఆ దేశ రాజు ప్రశంసలకు పాత్రుడై, ఎన్నో విలువైన సువర్ణ, రజిత, మరకత, మాణిక్య బహుమతులు సాధించి.. ఆనందంగా ఇంటికొచ్చి.. తన ఘనతను ఇంటిల్లపాదికి చెబుతాడు. ఇంట్లో అందరు పొగిడినా.. తండ్రి మాత్రం.. మంచిది అని ముక్తసరిగా అంటాడు. అంతే.. తన తండ్రి తనకు శత్రవు. తన ఘనత చూసి ఓర్వలేకపోతున్నాడు. ఇలాంటి తండ్రి లోకంలో ఎవరైనా ఉంటారా.. అని కక్ష కడతాడు. మరునాడు రాత్రి ఆ ఇంటి అటకపై పెద్ద బండరాయి పెట్టుకుని కూర్చుంటాడు. తన తండ్రి భోజనానికి కూర్చోగానే.. ఆ రాయిని తండ్రి తలపై వేసి హతమార్చాలని పథకం వేశాడు.
క్షణకాలంలో ఘోరం జరిగిపోయి ఉండేది. మహా పాపానికి భారవి అర్హుడయ్యేవాడు. భోజనానికి కూర్చుండగా… తన తల్లితో తండ్రి అన్న మాటలు విని.. తన తండ్రికి తనపై ఉన్న అపార ప్రేమ తెలుసుకున్నాడు. ఎంతో మ్రాన్పడిపోయాడు. భారవికి మించిన పాండిత్య శిరోమణి ఈ రాజ్యంలోనే లేరని.. భారవి తండ్రి, తన సతీమణికి తెలియజేశాడు. తాను ఆ దేశ రాజుకు కుమారుడి పాండిత్య విశేషతను, కొడుకు గొప్పతనాన్ని తెలియజేస్తూ.. అద్భుతంగా రాసిన కవితను, పాటలను ఆమెకు వినిపించాడు. తన తండ్రికి తనపై ఇంత ప్రేమాభిమానాలు ఉన్నాయా.. మరెందుకు తనను అంతగా దూరంగా, భారంగా చూశాడు అని భారవి అనుకున్నాడు.
ఆ వెంటనే అటకపై నుంచి దిగి.. కళ్లనీళ్లు పెట్టుకుంటూ.. తండ్రి పాదాలపై పడి విలపించాడు. తాను చేయబోయే ఘోరాన్ని చెప్పి.. తనకు నిష్కృతి లేదని చిన్నపిల్లాడిలా తల్లిదండ్రుల పాదాలపై పడి ఏడ్చాడు. తమ బిడ్డల గొప్పతనాన్ని తామే చాటితే.. అది గర్వానికి, అహంకారానికి దారితీసి.. బిడ్డల పతనానికి కారణం అవుతుందని, పైగా తమ బిడ్డలను తాము అతిగా పొగిడితే అది ఆయుక్షీణమని.. తమ బిడ్డలు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దలు కోరుకుంటారని, తాను అదే కోరుకున్నానని భారవి తండ్రి చెబుతాడు. ఇప్పుడు.. ఈ మనవడికి ఈ కథ తెలుసుంటేనో, ఎవరైనా చెప్పి ఉంటేనో.. తాత నిండు ప్రాణాలు నిలిచేవేమో.. తన తల్లికి తండ్రి ఉండేవాడేమో.. తనకు పెద్ద దిక్కు ఉండేదేమో.. కారాగృహానికి బదులు…. కర్మాగారాల అధిపతిగా వేనోళ్ల కీర్తి ప్రతిష్ఠలు పొందేవాడేమో.. ఎవరైనా ఒకటే గ్రహించాలి….ఎవరి కుటుంబ పెద్దలైనా.. ఆ కుటుంబశ్రేయస్సుకే పాల్పడతారు తప్ప.. కక్షలు కార్పణ్యాలకు కాదు. మధ్యలో వచ్చిన ఎవరైనా.. ఎవరినైనా రాంగ్ పాత్ లోకి దింపితే.. అప్పుడు ఎవరైనా అడుగులు తడబడేలా వేస్తుంటే.. సమర్థవంతంగా వ్యవహరించి వాటిని సరిద్దాల్సిన బాధ్యత ఆ కుటుంబ సభ్యులపైన ఉంటుంది. కోపాలు, ఆవేశాలు, కక్షలు, కార్పణ్యాలు సమస్యలకు పరిష్కారాలు చూపవని గుర్తెరగాలి.