స్వతంత్ర వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత ఈసారి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో సత్తా చూపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాజస్తాన్,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో తమకున్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అయితే విశ్వప్రయత్నాలను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. అయితే ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో గత కొంత కాలంగా తీవ్రంగా విభేదిస్తున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన విషయంలో అధిష్ఠానం తీరుపై ఆగ్రహంతో ఉన్న సచిన్ పైలట్..సొంత పార్టీ పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు జాతీయ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తన తండ్రి రాజేష్ పైలట్ వర్థంతి రోజైన జూన్ 11న దౌసాలో కొత్త పార్టీ గురించి సచిన్ పైలట్ ప్రకటన చేసే అవకాశముందని ఆ కథనాలు చెబుతున్నాయి. ఏటా ఆ రోజు తన అభిమానులతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు సచిన్ పైలట్ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగానే కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు సచిన్ పైలెట్ మద్దతుదారుల సమాచారం వస్తోంది. అయితే కొత్త పార్టీ ఏర్పాటు గ్రౌండ్‌వర్క్ కోసం పైలట్.. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన సంస్థ ‘ఐప్యాక్’ సాయం తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పార్టీకి ప్రగతిశీల కాంగ్రెస్ లేదా రాజ్ జన సంఘర్ష పార్టీ అనే పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.


