New Rules 2023 | మార్చి ఒకటో తేదీ వచ్చింది. ఒకటో తేదీ అంటే కొత్త నెల.. సాధారణంగా ఒకటో తేదీ కోసం వేతన జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే జీతం వచ్చే రోజు.. జీతం రావడంతో పాటు.. కట్టుకోవల్సిన ఇంటి అద్దెలు, ఈఎంఐలు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. అయితే కొత్త నెలతో పాటు మన జేబు ఖాళీ చేసేందుకు కొత్త నిబంధనలు కొన్ని అమలులోకి వచ్చాయి. ప్రధానంగా బ్యాంకింగ్, గ్యాస్ సిలిండర్, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలలో మార్పులు వచ్చాయి. ఆ కొత్త నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.
New Rules 2023 |ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు
ప్రతినెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మార్చి 1న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్లపై ఏకంగా 350 రూపాయల మేర పెంచాయి చమురు కంపెనీలు.
బ్యాంకు రుణాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లకు పెంచింది. దీంతో వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు అమాంతం పెరిగాయి. అటు రుణాలను నిర్ణయించే బేస్ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించడంతో.. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు చార్జీలు పెరిగాయి. ఈ కొత్త ఛార్జీలు మార్చి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై క్రెడ్ ద్వారా అద్దె చెల్లించేవారికి 99 రూపాయలుగా ఉన్న ఈ చార్జ్‌ను.. ఈసారి ఎస్‌బీఐ డబుల్ చేసి.. ఏకంగా 199 రూపాయలకు పెంచింది.
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్ ఖాతాదారులకు అధిక పెన్షన్ ఆప్షన్‌కు అవకాశం లభించింది. దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి ౩వ తేదీ.