గత నెలలో అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ జోర్డాన్ సరిహద్దుల్లో సైనికుల కాల్పుల్లో చనిపోయిన కేరళ వాసి జాబ్ స్కామ్ బాధితుడిగా గుర్తించారు. థామస్ గాబ్రియేల్ పెరెరా , అతని బావమరిది ఎడిసన్ చార్లెస్ ఫిబ్రవరి 10న విజిటింగ్ వీసాపై జోర్డాన్‌కు చేరుకున్న తర్వాత ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో థామస్ గాబ్రియేల్ పెరెరా సైనికుల కాల్పుల్లో మృతి చెందాడు.
థామస్ పెరెరా , ఎడిసన్ చార్లెస్‌లకు నెలకు రూ. 3,50,000 జీతంతో బ్లూ-కాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జోర్డాన్‌కు రప్పించారని దర్యాప్తులో తేలింది. వారు భారతదేశం నుండి బయలుదేరే ముందు ఒక ఏజెంట్‌కు రూ. 2,10,000 చెల్లించి, టూరిస్ట్ వీసాపై జోర్డాన్ చేరుకున్న తర్వాత అదనంగా రూ. 52,289 ($ 600) ఇచ్చారు. అయితే ఫిబ్రవరి ప్రారంభంలో వారు జోర్డాన్ రాజధాని నగరం అమ్మాన్‌కు చేరుకున్న తర్వాత ఏజెంట్ వారికి ఉద్యోగాలు అందుబాటులో లేవని చెప్పాడట.
ఇజ్రాయెల్‌లో చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని.. అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాలని ఆ ఏజెంట్ వారిద్దరినీ ప్రోత్సహించినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 10న.. వారిద్దరూ సరిహద్దు దాటడానికి ప్రయత్నించినప్పుడు జోర్డాన్ సైనికులు వారిపై కాల్పులు జరిపారు. థామస్ గాబ్రియెల్ పెరెరా అక్కడికక్కడే మరణించగా.. ఎడిసన్ చార్లెస్ ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స పొందిన తర్వాత అతన్ని భారతదేశానికి తిరిగి పంపించారు.
ఈ ఇద్దరూ కూడా కేరళవాసులు.. అంతకుముందు ఇద్దరూ ఆటో డ్రైవర్లుగా పనిచేసి జీవనం సాగించేవారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం “దురదృష్టకర పరిస్థితుల్లో ఒక భారతీయ పౌరుడు మరణించిన వార్త” తెలిసిందని తెలిపింది.