స్వతంత్ర వెబ్ డెస్క్: ఇంధన ధరలు ఎంత భారీగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే.. రూ.100కు పైగా చెల్లించాల్సి వస్తోంది. ఇంధన ధరలు పెరిగితే.. ఆటోమేటిక్‌గా మిగతా వాటి ధరలు కొండెక్కి కూర్చుంటాయి. ఎన్నికల ముందు మహా అయితే 2, 3 రూపాయలు దిగి వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి ఊహించడం కూడా అత్యాశే అవుతుంది. పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న సమయంలో ఓ చోట మాత్రం భారీ తగ్గింపు ప్రకటించారు. ఏకంగా లీటర్ పెట్రోల్‌పై 12 రూపాయలు తగ్గించడంతో జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పైగా ఇది ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోనే ఈ బంపరాఫర్ ప్రకటించడం గమనార్హం.
తిరుపతిలోని డాలర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత దివాకర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా.. వాహనదారుల కోసం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన బర్త్‌డే రోజున ప్రజలకు సబ్సిడీలో పెట్రోల్ అందించారు. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 12 రూపాయలు తగ్గింపు ప్రకటించాడు. తిరుపతి-చంద్రగిరి సరిహద్దులో గల తిరుచానూరు భారత్ పెట్రోల్ బంక్‌లో.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఆఫర్ గురించి జనాలకు తెలియడంతో పెద్ద ఎత్తున బంక్ దగ్గరకు చేరుకున్నారు. దాంతో కొన్ని గంటల్లోనే 1000 లీటర్ల పెట్రోల్ అమ్ముడైంది.
ఈ ఆఫర్‌లో భాగంగా మనిషికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే పంపిణీ చేశారు. ఇక రాత్రి 8 గంటల లోపు దాదాపు 5 వేల లీటర్లు పంపిణి అమ్మినట్లు తెలిపారు. ఆ ఆఫర్ విని దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంతేకాదు తన పుట్టిన రోజు సందర్భంగా ఇలా సబ్సిడీ మీద పెట్రోల్ అమ్మడం వల్ల అటు సేల్స్‌తో పాటు ఇటు ఫ్రీ పబ్లిసిటీ కూడా లభించినట్లు అయ్యింది అంటున్నారు ఈ వార్త తెలిసిన జనాలు. ఈ మధ్యకాలంలో ఇలాంటి బంపరాఫర్లు తరచుగా దర్శనం ఇస్తోన్న సంగతి తెలిసిందే. తక్కువ ధరకే బిర్యానీ, బర్త్‌డే రోజున టమాటాల పంపిణీ వంటి ఆఫర్లతో వార్తల్లో నిలుస్తున్నారు కొందరు వ్యక్తులు.