ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరె స్టు అయిన కవిత.. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, ఛన్‌ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అర్వింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అదే చార్జ్‌షీట్‌పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.
ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే, మహిళగా PMLA సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ, దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది.