స్వతంత్ర, వెబ్ డెస్క్: సరస్సులు ఎక్కడైనా గుండ్రంగా ఉండడం చూశారా. విభిన్న ఆకారాల్లో ఉంటూ కనువిందు చేస్తుంటాయి. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో మాత్రం ‘కింగ్స్‌లీ’ లేక్ మాత్రం గుండ్రంగా దర్శనమిస్తుంటుంది. ఈ సరస్సును ‘సిల్వర్ డాలర్ లేక్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత గుండ్రంగా ఉన్న సరస్సు అనేక విశేషాలను కలిగి ఉంది. దాదాపు 2వేల ఎకరాల్లో సహజంగా ఏర్పడిన ఈ చెరువు 5.5 మైళ్ల పొడవుంది. ఉత్తర, పడమర దిశల్లో కలిపి సుమారు 200 రేవులున్నాయి. సుమారు 90 అడుగుల లోతు ఉండడంతో ఫ్లోరిడాలోనే లోతైన సరస్సుగా కూడా పేరుగాంచింది. ఫ్లోరిడాలోనే పురాతన, ఎత్తైన సరస్సుగా నిలిచింది. వేసవి వచ్చిందంటే ప్రజలు కింగ్స్‌లీ లేక్‌కు క్యూ కడుతుంటారు. ఈ సరస్సును ఆకాశంపై నుంచి చూస్తే ఒక వెండి నాణెం మెరుస్తున్నట్లుగా గుండ్రంగా కన్పిస్తుండటంతో పైలట్లు దీనికి ‘సిల్వర్ డాలర్ లేక్’ అనే పేరు పెట్టారట.